మానవత్వం లేదా? రైతులను పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటారా? : అన్నదాతలకు అండగా మియా ఖలీఫా..

మానవత్వం లేదా? రైతులను పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటారా? : అన్నదాతలకు అండగా మియా ఖలీఫా..

భారతదేశంలో కొనసాగుతున్న రైతుల నిరసనకు మద్దతుగా మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా ట్వీట్టర్ ద్వారా సపోర్ట్ చేశారు. రైతులు నిరసనలు చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని ఆమె “మానవ హక్కుల ఉల్లంఘన” అంటూ చెప్పుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కలిగిన మియా ఖలీఫా పోస్ట్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవహారం గురించి చర్చ జరుగుతోంది.

అంతేకాదు.. రైతులను రాజకీయాల కోసం పెయిడ్ ఆర్టిస్ట్‌లతో పోల్చడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. రైతులను పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్లపై నిరసనలు చేస్తుండగా.. రైతులు చేస్తున్న ఆందోళనకు ఊహించని వ్యక్తుల నుంచి మద్దతు లభిస్తోంది. పలు దేశాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే రైతులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలుపుతున్నారు. స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి, ప్రపంచ నాయకులను తన ప్రసంగంతో కడిగిపారేసిన యువ కెరటం గ్రెటా థంబర్గ్ కూడా భారత్‌లో రైతు ఉద్యమానికి మద్దతు తెలిపింది.

అలాగే, ప్రముఖ బార్బేడియన్ సింగర్, నటి, వ్యాపారవేత్త రాబిన్ రిహన్నా కూడా రైతు ఉద్యమానికి తన మద్దతు తెలిపింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టింది. దీని గురించి మనమంతా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించింది.