Groundnut : వేరుశనగలో సూక్ష్మ పోషకాల లోపం

జింకు లోపం ఉన్నప్పుడు వేరుశెనగ ఆకులు చిన్నవిగా మారి, మామూలు పరిమాణము లేకుండా పోయి, రెండు ఆకుల మధ్య పొడవు తగ్గిపోతుంది.

Groundnut : వేరుశనగలో సూక్ష్మ పోషకాల లోపం

Groundnut

Groundnut : దక్షిణ భారతదేశంలో ఖరీప్‌, రబీ సీజనులలో వేరుశనగ పంటను సాగు చేస్తారు. నీటి సదుపాయం గల ప్రాంతాలలో వేసవి కాలంలో జనవరి-మార్చి మధ్య తక్కువ సమయంలో పంటకోతకు వచ్చే రకాలను సాగుచేస్తారు. వేరుశనగలో నూనె, ప్రోటీనులు, కార్బోహైడ్రెట్‌లు,, విటమిన్లు అధిక ప్రమాణములో ఉంటాయి. వేరుశనగ సాగులో రైతులు తగిన యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. ముఖ్యంగా వేరుశనగలో సూక్స్మపోషకాల యాజమాన్యం ముఖ్యమైనది.

వేరుశనగ మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి, ప్రత్యుత్పత్తికి 17 రకాల పోషకాలు తప్పనిసరిగా అవసరం. మొక్క జీవక్రియలలో ప్రతిపోషకం ఒకప్రత్యేకమైన పనిని నిర్వర్తిస్తుంది. అది లోపించినప్పుడు ఆ పని కుంటుపడుతుంది. దీని ప్రభావం వల్ల దిగుబడి తగ్గుతుంది. ఒక పోషకం చేసే పని వేరొక పోషకం చేయలేదు. దేని ప్రాముఖ్యత దానిదే. మొక్క తీసుకునే పరిమాణాన్ని బట్టి ముఖ్య, ఉప, సూక్ష్మ పోషకాలుగా విభజించబడినవే కానీ, వాటి ప్రాధాన్యత, ఆవశ్యకతలలో తేడాలు లేవు. మొక్కకు అవసరమైన అన్ని పోషకాలు తగిన సమయంలో కావాల్సిన పరిమాణంలో లభ్యమయ్యే విధంగా అందుబాటులో ఉన్నప్పుడు పైరు ఆరోగ్యంగా, దృఢంగా ఉండి మంచి దిగుబడులు పొందడం సాధ్యపడుతుంది.

ఇనుము : సున్నం అధికంగా ఉండే నేలల్లో, నల్లరేగడి నేలల్లో, ముంపు నేలల్లో మరియు బైకార్బొనేట్ అధికంగా ఉండి, సాగు నీటితో సేద్యం చేసినప్పుడు వేరుశెనగలో ఇనుపదాతు లోపం కనిపిస్తుంది. ఇనుము లోపం లేత ఆకుల్లో మధ్య భాగాలు తమ సహజ ఆకుమచ్చ రంగును కోల్పోయి క్రమంగా ఆకు ఈనెలతో సహా పసుపు వర్ణంలోకి మారిపోతాయి. ఇనుము లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఆకు మొత్తం లేత పసుపు లేక తెల్లగా మారిపోతుంది. కొత్త చిగుర్లు పూర్తిగా తెల్లగా ఉంటాయి. ఇనుము లోపాన్ని సవరించడానికి లీటరు నీటికి 5 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ మరియు 1 గ్రా. సిట్రిక్ ఆమ్లము లేదా నిమ్మరసం కలిపి వారం రోజుల వ్యవధిలో 2-3 మార్లు పిచికారి చేయాలి.

జింకు : జింకు లోపం ఉన్నప్పుడు వేరుశెనగ ఆకులు చిన్నవిగా మారి, మామూలు పరిమాణము లేకుండా పోయి, రెండు ఆకుల మధ్య పొడవు తగ్గిపోతుంది. ఫలితంగా ఆకులు చిన్నవిగా మరియు గుబురుగా ఉంటాయి. వీటితో పాటు ఈనెల మధ్య ఆకు పసుపు రంగుగా కూడా మారవచ్చు. జింకు లోపాన్ని సవరించటానికి ఒక లీటరు 2 గ్రాముల జింకు సల్ఫేట్ కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. పంట సాగు చేసే నీళ్ళలో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ ను మూడు పైర్లకు ఒక్కసారి దుక్కిలో వేసే జింకు లోపాన్ని నివారించవచ్చు.

మ్యాంగనీసు :ఇనుము, మ్యాంగనీసు లోప లక్షణాలు దాదాపు ఒకేవిధంగా ఉంటాయి. మ్యాంగనీసు లోపంతో ఈనెలు ప్రక్కనే అంటి పెట్టుకొని వుండే ఆకు భాగము ముదురు ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. ఇనుము లోపంలో ఈనెలు ప్రక్కనే అంటిపెట్టుకొని వుండే ఆకు భాగం పసుపు లేక లేతపసుపు రంగు కలిగివుంటుంది. ఎకరానికి 20 కిలోల మ్యాంగనీసు సల్ఫేట్ వేసి మ్యాంగనీసు లోపాన్ని నివారించవచ్చు.

బోరాన్ :ఈ లోపం అంతగా కనిపించకపోయినప్పటికీ, బోరాన్ లోపం వల్ల ఆకుల క్రింద భాగంలో మచ్చలేర్పడడం, ఆకుల అంచులు క్రమమైన ఆకారంలో లేకపోవడం, పూతకు ఆలస్యంగా రావడం, ఊడలు తక్కువుగా దిగడం, కాయలు డొల్లగా తయారవడం, పప్పు నల్లబడడం జరుగుతుంది. లోప నివారణకు ఎకరానికి 4 కిలోల బోరాక్సు ఆఖరి దుక్కిలో వేసి కలిపిదున్నాలి. మొక్కపై లోప లక్షణాలు గమనిస్తే 0.10 నుండి 0.15 శాతం బోరాక్సు ద్రావణాన్ని పిచికారీ చేయాలి.