అండమాన్ కు హై స్పీడ్ ఇంటర్నెట్ : సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును ప్రారంభించిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : August 10, 2020 / 03:47 PM IST
అండమాన్ కు హై స్పీడ్ ఇంటర్నెట్ : సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును ప్రారంభించిన మోడీ

అండమాన్ ద్వీప సమూహానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించే సబ్ మెరీన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్​ వ్యవస్థ(OFC)​ను సోమవారం(ఆగస్ట్-10,2020)భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొని రిమోట్​ ద్వారా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చెన్నై నుంచి పోర్ట్​ బ్లెయిర్​ సహా మరో 7 ద్వీపాలకు సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు.



2018 డిసెంబర్ 30న ఈ ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా తీరంలో ఉన్న ద్వీపాలకు టెలికమ్యునికేషన్ సిగ్నళ్లు పంపించే విధంగా సముద్రగర్భంలో సబ్​మెరైన్ కేబుళ్లను ఏర్పాటు చేశారు. అంతకుముందు… కేబుల్ వ్యవస్థ ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

అలాగే అనుకున్న స‌మ‌యానికి 2300 కిలోమీటర్ల దూరం స‌ముద్రం లోప‌ల కేబుల్ వేయ‌డం ప్రశంసనీయమన్నారు. రూ. 1224 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తిచేసిన బీఎస్ఎన్ఎల్, టీసీఐఎల్ కంపెనీలకు ధన్యవాదాలు అని మోడీ అన్నారు. అండమాన్ ప్రజలకు ఈ ఆగస్టు 10 చాలా ప్రత్యేకమైన రోజన్నారు



OFCతో అండ‌మాన్ నికోబార్ దీవుల్లో ఈజ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంద‌ని మోడీ తెలిపారు. చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ వరకు, పోర్ట్ బ్లెయిర్ నుండి లిటిల్ అండమాన్, పోర్ట్ బ్లెయిర్ నుండి స్వరాజ్ ద్వీపం వరకు ఈ సేవ ప్రారంభమైందన్నారు. అంతులేని అవకాశాలతో నిండిన ఈ ఆవిష్కారంపై అండమాన్ అండ్ నికోబార్ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

అండమాన్ వాసులకు హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, వేగవంతమైన, నమ్మదగిన మొబైల్, ల్యాండ్‌లైన్ టెలికాం సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. తద్వారా డిజిటల్ ఇండియా ఫలాలు అందుతాయ‌న్నారు. టూరిజం, బ్యాంకింగ్‌, షాపింగ్‌, టెలి మెడిసిన్, టెలీ విద్యలాంటి వ‌స‌తులు సులువుగా అందుతాయన్నారు. ప్రధానంగా టూరిజం మెరుగుపడుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు.