CAA ఆందోళనల్లో విధ్వంసం : రూ.6.27 లక్షల నష్టపరిహారం ఇచ్చిన ముస్లింలు! 

  • Published By: sreehari ,Published On : December 28, 2019 / 08:21 AM IST
CAA ఆందోళనల్లో విధ్వంసం : రూ.6.27 లక్షల నష్టపరిహారం ఇచ్చిన ముస్లింలు! 

పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి పలు ప్రభుత్వ వాహనాలను, వైర్ లెస్ సెట్లను ధ్వంసం చేశారు. కొన్ని ప్రాంతాల్లో హింస్మాతక ఘటనలు చెలరేగాయి. ఈ ఆందోళనల్లో పలు ప్రభుత్వ ఆస్తులు చాలా వరకు ధ్వంసమయ్యాయి. అసోం మాత్రం అందోళనలతో అట్టుడికిపోయింది. 

యూపీ సహా ఇతర ప్రాంతాల్లో కూడా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. CAA నిరసన సెగ ఇతర రాష్ట్రాలను కూడా తాకింది. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సైనిక బలగాలు మోహరించాయి. ఆందోళనకారులు మరింత రెచ్చిపోయి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో మరింత హింసాత్మకంగా మారింది. CAA వ్యతిరేక ఆందోనల్లో జరిగిన నష్టానికి సంబంధించి ముస్లిం కమ్యూనిటీకి చెందిన మత పెద్దలు జిల్లా యంత్రాంగంతో చర్చించారు. 

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్ ప్రాంతానికి చెందిన ముస్లిం కమ్యూనిటీ సభ్యులు జిల్లా యంత్రాంగానికి రూ.6.27 లక్షల నష్టపరిహారానాన్ని చెక్ రూపంలో అందజేశారు. సీఏఏ ఆందోళనల్లో జరిగిన ప్రభుత్వ ఆస్తుల నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లాలోని ముస్లిం కమ్యూనిటీ విరాళాలను సేకరించింది. అలా సేకరించగా వచ్చిన మొత్తం రూ.6.27 లక్షలను జిల్లా యంత్రాంగానికి అందించగా, ఆ మొత్తాన్ని జిల్లా మేజిస్ట్రేట్ (DM) అంగీకరించినట్టు హజీ అక్రమ్ తెలిపారు. 

అంతేకాదు.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగానికి హామీ ఇచ్చినట్టు ఆయన చెప్పారు. ‘CAA ఆందోళనల్లో జరిగిన ప్రభుత్వ, ప్రజల ఆస్తుల నష్టానికి చింతిస్తున్నాం. దెబ్బతిన్న ఆస్తులకు సంబంధించి నష్ట పరిహారాన్ని చెక్ రూపంలో అందిస్తున్నాం. ముస్లిం కమ్యూనిటీలో వారంతా విరాళాలు ఇచ్చేందుకు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చారు’ అని హజీ అక్రమ్ ఓ మీడియాకు వెల్లడించారు.