నందిగ్రామ్ లో ఆ బ్లాక్ పైనే “ఇద్దరు బ్యాచిలర్స్” ఆశలు

రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్‌లో 30 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. సెకండ్‌ ఫేజ్‌లో మమతా బెనర్జీ, సువేందు అధికారి బరిలో నిలిచిన నందిగ్రామ్‌ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.

నందిగ్రామ్ లో ఆ బ్లాక్ పైనే “ఇద్దరు బ్యాచిలర్స్” ఆశలు

Nandigram Goes To Polls Tomorrow

Nandigram రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్‌లో 30 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. సెకండ్‌ ఫేజ్‌లో మమతా బెనర్జీ, సువేందు అధికారి బరిలో నిలిచిన నందిగ్రామ్‌ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. దీంతో బెంగాల్‌లో రెండోదశ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బెంగాల్‌లోని అత్యంత అక్షరాస్యత ఉన్న నియోజకవర్గాల్లో నందిగ్రామ్‌ ఒకటి.. గత ఎన్నికలను పరిశీలిస్తే ఇక్కడ హిందూత్వ కార్డ్‌ పనిచేస్తుందని అనుకోవడం సరికాదంటున్నారు విశ్లేషకులు.

నందిగ్రామ్‌ నియోజకవర్గం రెండు బ్లాక్‌ల్లో ఉంటుంది. ఇందులో బ్లాక్1 గెలుపోటముల్ని డిసైడ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు అన్ని ప్రధాన పార్టీలు బ్లాక్-2 పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాయి. అక్కడి ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నించాయి. కానీ ఈసారి మాత్రం బ్లాక్-1 కీలకం అవుతుందని భావిస్తున్నారు. మమత కూడా ఈ బ్లాక్‌ పైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

బ్లాక్‌ 1 మొత్తం జనాభాలో 34శాతం మంది ముస్లింలే… హిందూ ఓటర్లు 65.8శాతం ఉన్నారు. కానీ ఇక్కడున్న ముస్లిం ఓట్లలో ఎక్కువశాతం మమతాబెనర్జీ వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని హిందూ ఓట్లను కూడా కొల్లగొట్టగలిగితే గెలుపు సులభమే అని మమత భావిస్తున్నారు. ఇక్కడ సువేందు పూర్తి ప్రచారం కూడా చేయలేకపోయారు. నందిగ్రామ్ కేసులకు సంబంధించి కొన్ని రీఓపెన్ కావడానికి సువేందు కారణమని కొన్ని అనుమానాలున్నాయి. దీంతో ముస్లిం ఓటర్లలో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. కొన్ని బూతుల్లో పోలింగ్ ఏజెంట్లు కూడా కష్టమేనన్న అనుమానాలున్నాయి. అందుకే సువేందు అధికారి ఎక్కువగా నందిగ్రామ్ బ్లాక్-2పై దృష్టిపెట్టారు.

ఇక బ్లాక్‌ 2 లో ముస్లిం జనాభా కేవలం 12శాతమే. 87.7శాతం మంది హిందూ ఓటర్లున్నారు. అందుకే హిందు ఓటర్లను పోలరైజ్ చేసేందుకు ప్రయత్నించారు సువేందు. ఇక్కడ మెజారిటీ ఓట్లు రాబట్టి నందిగ్రామ్ బ్లాక్ -1లో కొన్ని హిందూ ఓట్లను రాబట్టుకున్నా గట్టెక్కవచ్చన్నది సువేందు ఆలోచన. అందుకే నందిగ్రామ్ బ్లాక్ 1 లో RSS రంగంలోకి దిగింది. కొన్ని హిందూ ప్రభావ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బ్లాక్-1లో ముస్లిం ఓట్లు తమకే అన్న నమ్మకంతో మమత ఉన్నారు. అందుకే ఆ బ్లాక్ లో భారీ ప్రచారం నిర్వహించలేదు. అలాగే సువేందు కూడా అక్కడ ఓట్లపై భారీ అంచనాలు పెట్టుకోలేదు. అందుకే తాను కూడా బ్లాక్ -1ను వదిలేసి నందిగ్రామ్ బ్లాక్-2పైనే ఫోకస్ పెట్టారు. దీంతో అందరి దృష్టి బ్లాక్-2 పైనే పడింది.

గతంలో భూసేకరణ ప్రభావం ఈ బ్లాక్ పై తక్కువగా ఉండటంతో సీపీఎం కూడా దీనిపైనే దృష్టి పెట్టింది. బ్లాక్-2లో ముస్లిం ఓట్లు తక్కువే అయినా సీపీఎం అభ్యర్థి తరపున ముస్లిం నేతలు భారీ ప్రచారం నిర్వహించారు. దీంతో కొన్ని ముస్లిం ఓట్లు అటువైపు మళ్లే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేస్తోంది. అదే జరిగితే తమకు మేలే అని భావిస్తోంది. ఏదేమైనా బూత్‌ లెవల్‌లో చూస్తే ఇప్పటికి టీఎంసీనే బలంగా ఉందని గణంకాలు చెబుతున్నాయి.. మరి నందిగ్రామ్‌ ఓటర్లు ఎవరికి ఓటు వేయనున్నారు? ఎవరిని గెలిపిస్తారు? అని యావత్‌ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.