గంగలో కోవిడ్ మృతదేహాలు…యూపీ,బీహార్,కేంద్రానికి NHRC నోటీసులు

గడిచిన కొద్ది రోజులుగా పవిత్ర గంగా నదిలో పెద్ద సంఖ్యలో కరోనా శవాలు తేలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోన్న విషయం తెలిసిందే.

గంగలో కోవిడ్ మృతదేహాలు…యూపీ,బీహార్,కేంద్రానికి NHRC నోటీసులు

Nhrc

NHRC గడిచిన కొద్ది రోజులుగా పవిత్ర గంగా నదిలో పెద్ద సంఖ్యలో కరోనా శవాలు తేలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోన్న విషయం తెలిసిందే. గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు కొట్టుకు వస్తున్న ఘటనలపై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) తీవ్రంగా స్పందించింది. ఈ సంఘటన సమాజానికి సిగ్గుచేటు.. అంతేకాదు ఇది మృతిచెందిన వ్యక్తుల మానవహక్కుల ఉల్లంఘనే అని జాతీయ మానవహక్కుల కమిషన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో స్థానిక అధికారులు విఫలమైనట్టు స్పష్టంగా తెలుస్తోందని పేర్కొంది.

గంగానదిలో శావాలు తేలియాడిన ఘటనలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు వస్తున్న క్రమంలో వాటిని పరిగణనలోకి తీసుకున్న NHRC..ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు,జల వనరుల డిపార్ట్మెంట్ సెక్రటరీ,కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారో తమకు నాలుగు వారాల్లోపు నివేదికను అందజేయాలని ఆదేశించింది.

పవిత్ర గంగానదిలో మృతదేహాలను పడేయటం గంగా ప్రక్షాళన ప్రాజెక్టు నిబంధనలను ఉల్లంఘించడమే. అవి కొవిడ్‌ బాధితుల మృతదేహాలుగా మాకు అందిన ఫిర్యాదుల్లో అనుమానాలు వ్యక్తం చేశారు. గంగా నదిలో కాలుష్యాన్ని కలిగించే ఏ ప్రాజెక్ట్ లేదా ప్రక్రియ లేదా కార్యకలాపాలను ఏ వ్యక్తి చేయకూడదు లేదా కొనసాగించకూడదు.. ఇదే నిజమైతే గంగానదిపై ఆధారపడి బతుకుతున్న అందరి జీవితాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని NHRC వ్యాఖ్యానించింది.

మరోవైపు, గంగానదిలో మృతదేహాలు కొట్టుకువచ్చిన ఘటనపై సిట్టింగ్‌ లేదా రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు ప్రదీప్‌కుమార్‌ యాదవ్‌, విశాల్‌ ఠాక్రే గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక, గంగా నదిలో తేలిన శవాలకు యూపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. గంగలో తేలుతున్న శవాలు కేవలం లెక్కలు కాదని.. అవి ఎవరో ఒకరి తండ్రి, తల్లి, సోదరుడు, సోదరివని అఖిలేష్ యాదవ్ అన్నారు. కరోనా కట్టడిలో యూపీ ప్రభుత్వం ఘోరం విఫలమైందని.. ప్రజల ప్రాణాలు కాపాడడంలో వైఫల్యం చెందిందని అఖిలేష్ మండిపడ్డారు.