Nitish Kumar : బీజేపీకి నితీష్ బిగ్ ఝలక్..’పెగాసస్”పై దర్యాప్తు జరగాల్సిందే

పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వివాదంపై దేశంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.

Nitish Kumar : బీజేపీకి నితీష్ బిగ్ ఝలక్..’పెగాసస్”పై దర్యాప్తు జరగాల్సిందే

Nitish Modi

Nitish Kumar పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వివాదంపై దేశంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. పెగాసస్ వివాదంపై కేంద్రం విచారణ జరిపించాలంటూ కొద్ది రోజులుగా విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అక్రమంగా ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని,ఉద్దేశ్యపూర్వకంగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని విపక్షాలు తెరమీదకు తీసుకొచ్చాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అటు పార్లమెంట్ ని కూడా ఈ అంశం కుదిపేస్తోంది. ఈ అంశం కారణంగానే ప్రతి రోజూ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వర్షాకాల సెషన్‌ మొత్తం ఇదే వ్యవహారంతో తుడిచిపెట్టుకుపోయేట్లుగా ఉంది.

READ Pegasus Scandal : దీదీ కీలక నిర్ణయం..పెగాసస్ గుట్టు తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు

అయితే, పెగాసస్ వివాదంపై విపక్షాల డిమాండ్ ని కేంద్రం పట్టించుకోకుండా తేలికగా తీసుకుంటున్న సమయంలో స్వపక్షం నుంచి కూడా పెగాసస్ అంశంపై విచారణ జరగాలన్నడిమాండ్‌ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జేడీయూ పార్టీ అధినేత, బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ నుంచే ఈ డిమాండ్‌ రావడం విశేషం. అయితే మిత్రపక్షం నుంచే ఈ డిమాండ్ రావడం ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.

విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లుగా పెగాసస్ అంశంపై దర్యాప్తు జరపాలా అని సోమవారం సీఎం నితీష్ కుమార్ ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..నిస్సందేహంగా ఇది జరగాల్సిందే అని నితీష్‌ సమాధానమిచ్చారు. చాలా రోజులుగా టెలిఫోన్ ట్యాపింగ్ గురించి చర్చ జరుగుతున్నది. ఈ విషయాన్ని పార్లమెంట్ లో కూడా లేవనెత్తుతున్నారు. మీడియాలో కూడా వార్తా నివేదికలు వచ్చాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా చర్చించి పరిశీలించాలి. ప్రజలను ఇబ్బంది పెట్టడానికి, వేధించడానికి ఇలాంటివి చేయకూడదు. మొత్తం విషయాన్ని బహిరంగపర్చాలి అని నితీష్‌ కుమార్‌ విలేఖరులతో అన్నారు. పెగాసస్ వ్యవహారంపై దర్యాప్తు జరగాలి మరియు ప్రతి అంశాన్ని నిర్ధారించిన తర్వాత చర్యలు తీసుకోవాలి అని నితీష్ పేర్కొన్నారు. మరోవైపు, పెగాసస్‌ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఉభయసభల్లో ఈ అంశంపై చర్చ చేపట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఏడు విపక్ష పార్టీలు కూడా రాష్ట్రపతికి లేఖ కూడా రాశాయి.

READRahul Gandhi : పెగాసస్ తో “భారత ప్రజాస్వామ్య ఆత్మ”పై ప్రధాని మోదీ దెబ్బకొట్టారు