మహా మలుపు..శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్

  • Published By: venkaiahnaidu ,Published On : November 10, 2019 / 02:58 PM IST
మహా మలుపు..శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్

మహారాష్ట్రలో రాజకీయాలు సరికొత్త మలుపును తీసుకున్నాయి. ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయం,తగినంత బలం తమకు లేదని ఇవాళ(నవంబర్-10,2019)బీజేపీ ప్రకటించడంతో మహా రాజకీయాలు మరో మలుపు తీసుకుంటున్నాయి. దీంతో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ ఆహ్వానించారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభత్వం ఏర్పాటు చేసి తీరుతాం అని శివసేన ముఖ్యనాయకుడు ఏక్ నాథ్ షిండే ఆశాభావం వ్యక్తం చేశారు. 

కాబోయే ముఖ్యమంత్రి శివ సేనకు చెందిన నాయకుడే అవుతాడని సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. ఇందులో మరో మాటకు అవకాశమే లేదని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయాలంటూ ముంబైలో పలుచోట్ల బ్యానర్లు, పోస్టర్లు వెలిసిన విషయాన్ని ప్రశ్నించగా.. ప్రతి ఒక్కరూ అదే జరగాలని కోరుకుంటున్నారని బదులిచ్చారు. ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయాలనే విషయంపై ఇప్పుడే ఏమీ మాట్లాడ లేమని అన్నారు. ఎన్సీపీ-కాంగ్రెస్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీతో శివసేన చర్చలకు రెడీ అయినట్లు సమాచారం. అయితే ఎన్డీయే నుంచి శివసేన పూర్తిగా వైదొలిగితేనే తమ మద్దతు ఉంటుందని ఎన్సీపీ షరతు విధించింది.

288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున 105మంది విజయం సాధించగా, శివసేనకు 56మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 44మంది,ఎన్సీపీ 54మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ-శివసేన,ఎన్సీపీ-కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే 50:50ఫార్ములాకు బీజేపీ ఒప్పుకోకపోడంతో శివసేన బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు. ఈ క్రమంలో శనివారం అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. శివసేన హ్యాండ్ ఇవ్వడంతో తనగినంత సంఖ్యాబలం లేదు కనుక తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదంటూ బీజేపీ ఇవాళ ప్రకటించింది. దీంతో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.