పేలుడు పదార్థాల కేసులో హోంమంత్రిపై సంచలన ఆరోపణలు

పేలుడు పదార్థాల కేసులో హోంమంత్రిపై సంచలన ఆరోపణలు

Param Bir Singh Accuses Maharashtra Home Minister Of Corruption1

ముంబైలో ముకేశ్‌ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు రాజకీయంగానూ దుమారం సృష్టిస్తోంది. మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. అంబానీ కేసులో అరెస్టయిన పోలీస్‌ అధికారి సచిన్‌ వాజేను నెలకు రూ.100 కోట్లు వసూలు చేసి తీసుకొచ్చి ఇవ్వాలని అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించారని… సీఎం ఉద్ధవ్‌ థాక్రేకు పరంబీర్‌సింగ్‌ లేఖ రాశారు. రెస్టారెంట్లు, హోటళ్ల, ఇతర వ్యాపారుల నుంచి లంచాలు వసూలుచేసి తీసుకొచ్చి ఇమ్మనేవారని ఆరోపించారు.

వాజేకు వంద కోట్లు లక్ష్యం నిర్ధేశించినప్పుడు.. మంత్రి వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారని లేఖలో పేర్కొన్నాడు ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌. ముంబై క్రైమ్‌ ఇంటిలిజెన్స్‌ యూనిట్‌ హెడ్‌గా ఉన్న వాజేను హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ కొన్ని నెలలుగా పలుమార్లు తన నివాసానికి పిలిపించుకున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. ముంబైలో 17 వందల 50 బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయని, ఒక్కోదాని నుంచి రెండు, మూడు లక్షలు వసూలు చేసినా 40, 50 కోట్లు అవుతుందని, మిగిలింది ఇతరమార్గాల్లో సేకరించాలని వాజేను మంత్రి ఆదేశించారన్నారు పరంబీర్‌ సింగ్

మాజీ పోలీస్‌ కమిషనర్‌ ఆరోపణలను హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఖండించారు. పేలుడు పదార్థాల కేసులో తనని తాను రక్షించుకునేందుకే ఈ ఆరోపణలు చేసినట్లు అనిల్‌ దేశ్‌ముఖ్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు, మన్‌సుఖ్‌ హిరేన్‌ మృతి కేసులో సచిన్‌ వాజే పాత్ర ఉందని దర్యాప్తులో తేలిందని, తర్వాత ఇరుక్కునేది అతనేనన్న భయంతో పరంబీర్‌ సింగ్‌..తనపై అవాస్తవ ఆరోపణలు చేశారని అన్నారు. తనపై కేసులో విచారణలో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో ఉద్ధవ్‌ ప్రభుత్వం పరంబీర్‌సింగ్‌ను ముంబై పోలీస్‌ కమిషనర్‌ పదవి నుంచి రెండు రోజుల క్రితం బదిలీ చేసింది.