నేటి నుంచి పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు..కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం

పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ దఫా బడ్జెట్‌ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశముంది.

నేటి నుంచి పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు..కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం

Parliament’s budget meetings : పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ దఫా బడ్జెట్‌ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశముంది. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు రెడీ అవ్వగా… ప్రతిపక్షాలపై ఎదురుదాడే లక్ష్యంగా కేంద్రం సిద్ధమైంది. దీంతో ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకొస్తాయా..లేక చర్చకు బదులు రచ్చ కొనసాగుతుందా…?

కరోనా నిబంధనల మధ్య సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గత సెషన్‌లాగే ఈసారి కూడా లోక్‌సభ, రాజ్యసభ వేర్వేరు సమయాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ సమావేశాలు జరుగుతాయి. ఇవాళ ప్రారంభమయ్యే ఈ సమావేశాలు… ఏప్రిల్‌ 8న ముగియనున్నాయి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. దాదాపు నెలరోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి.

ప్రస్తుతం తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, అసోంతోపాటు.. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో.. పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. బెంగాల్‌, తమిళనాడులో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలంతా ఈ రాష్ట్రాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ప్రధానిసహా బీజేపీ అగ్రనేతలంతా వరుసగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు ఆయా రాష్ట్రాల్లోని విపక్ష పార్టీలు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. దీంతో కీలక నేతలంతా సమావేశాలకు గైర్హాజరయ్యే అవకాశముంది.

మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం 100 రోజులు దాటింది. దీంతో ఈ సమావేశాల్లో మరోసారి వ్యవసాయ చట్టాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశముంది.

రెండో విడత బడ్జెట్‌ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశముంది. వివిధ శాఖల పద్దులు, ఫైనాన్స్‌ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్సెన్సీ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ ఫుడ్‌ టెక్నాలజీ సవరణ బిల్లును ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. మరికొన్ని కీలక బిల్లులకు ఆమోదం తెలుపనుంది.

లోక్‌సభలో 36 శాతం మంది, రాజ్యసభలో 62 శాతం మంది సభ్యుల వయసు 60 ఏళ్లు దాటింది. వారి కోసం పార్లమెంట్‌లో రెండు వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపీలతో పాటు వారి కుటుంబ సభ్యులు అక్కడ టీకా తీసుకోవడానికి వీలు కల్పించారు.