భారత్‌కి అమెరికా షాక్ : భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు

భారత్ లో పెట్రోల్ ధరలు భారీగా పెరగనున్నాయా? లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు కానుందా? పరిణామాలు చూస్తుంటే ఈ భయాలే కలుగుతున్నాయి. భారత్ కి ఇబ్బంది

  • Edited By: veegamteam , April 23, 2019 / 03:05 AM IST
భారత్‌కి అమెరికా షాక్ : భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు

భారత్ లో పెట్రోల్ ధరలు భారీగా పెరగనున్నాయా? లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు కానుందా? పరిణామాలు చూస్తుంటే ఈ భయాలే కలుగుతున్నాయి. భారత్ కి ఇబ్బంది

భారత్ లో పెట్రోల్ ధరలు భారీగా పెరగనున్నాయా? లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు కానుందా? పరిణామాలు చూస్తుంటే ఈ భయాలే కలుగుతున్నాయి. భారత్ కి ఇబ్బంది కలిగించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం(ఏప్రిల్ 23,2019) కీలక నిర్ణయం తీసుకున్నారు. మే నుంచి ఇరాన్ ముడి చమురును కొనుగోలు చేయవద్దని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్‌ సహా ఏ దేశానికీ మినహాయింపు ఇవ్వబోమని ప్రకటించారు. ఇంతవరకు కొన్ని దేశాలకు ‘విశేష తగ్గుదల మినహాయింపు’ (సిగ్నిఫికెంట్‌ రిడక్షన్‌ ఎక్సెప్షన్‌-ఎస్‌ఆర్‌ఈ) విధానం కింద అక్కడ నుంచి చమురును కొనుగోలు చేసే అవకాశం ఇచ్చారు. ఇకపై ఆ విధానం ఉండబోదని వైట్ హౌస్ ప్రకటించింది. ఎస్‌ఆర్‌ఈల కాలపరిమితి మే 2న ముగుస్తుంది. దాన్ని మళ్లీ పొడిగించకూడదని ట్రంప్‌ నిర్ణయించారు. ఇరాన్‌ చమురు ఎగుమతులను (మే 4వ తేదీకి) సున్నా స్థాయికి తీసుకుని రావడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు లేకుండా చేయడమే తమ ఉద్దేశం అని వైట్ హౌస్ అధికారులు తెలిపారు.

ఇరాన్ అణు కార్యకలాపాలను నియంత్రించడంలో భాగంగా ఆ దేశంపై ఆర్థికపరమైన ఒత్తిడిని తీసుకొస్తున్న అమెరికా.. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరైన ముడి చమురు కొనుగోళ్లను దెబ్బతీయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్న హోదాలో ఇరాన్ నుంచి ముడి చమురును ఎవరూ కొనరాదని ఆదేశించింది. 2015లో ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ట్రంప్‌.. 2018 నవంబర్ లో ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించారు. ఆ దేశం నుంచి చమురును దిగుమతి చేసుకోకూడదని చెప్పారు. అయితే 8 దేశాలు… భారత్‌, చైనా, టర్కీ, జపాన్‌, ఉత్తర కొరియా, ఇటలీ, తైవాన్‌, గ్రీస్‌లకు 180 రోజుల పాటు మినహాయింపు ఇచ్చారు.

ఇరాన్‌ నుంచి దిగుమతులను సున్నా స్థాయికి తగ్గించాలని, లేకుంటే ఆంక్షలు ఫేస్ చెయ్యాల్సి ఉంటుందని 2018 నవంబర్ 4న 8 దేశాలకు స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రీస్‌, ఇటలీ, జపాన్‌, సౌత్ కొరియా, తైవాన్‌లు ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించాయి. దిగుమతులను పూర్తిగా నిలిపివేసేలా ఈ దేశాలపై ఒత్తిడిని పెంచుతామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పారు. ఇరాన్ పాలకుల తీరు మారేదాకా దానిపై ఒత్తిడిని పెంచుతూనే ఉంటామని పాంపియో స్పష్టం చేశారు. అమెరికా తీరును ఇరాన్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఆంక్షలు ఎంతోకాలం నిలబడవని చెప్పింది.

ట్రంప్ ఆదేశాలు భారత్‌కు కష్టాలు తెచ్చిపెట్టనున్నాయని నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశీయ ఇంధన అవసరాల్లో 80 శాతానికిపైగా ఇతర దేశాల నుంచి వస్తున్న దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇరాన్‌ మూడో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో ఇరాక్‌, సౌదీ అరేబియా ఉన్నాయి. ట్రంప్‌ నిర్ణయంపై అధ్యయనం చేస్తున్నామని, దీని ప్రభావంపై లెక్కలు వేశాక తగిన సమయంలో ప్రకటన విడుదల చేస్తామని భారత అధికారులు వెల్లడించారు. భారత్‌, చైనాలతో పాటు మిగిలిన దేశాలపైనా ట్రంప్ ఆదేశాల ప్రభావం పడనుంది.

2017 ఏప్రిల్ నుంచి 2018 జనవరి వరకు భారత్‌కు ఇరాన్ 18.4 మిలియన్ టన్నుల ముడి చమురును సరఫరా చేసింది. దేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు మరింతగా ధరల్ని పెంచే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే ఆ ప్రభావం భారతీయ ఇంధన ధరలపై తప్పక ఉంటుందని, ఇప్పుడిప్పుడే శాంతించిన ధరలు మళ్లీ విజృంభించడం ఖాయమని అంటున్నారు. అమెరికా ఆంక్షలు..భారత్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చమురు దిగుమతులు తగ్గిపోతే పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతున్నారు. డిమాండ్ కు తగ్గ సప్లయ్ లేకపోతే ధరలు పెరిగే ఛాన్స్ ఉందని భయపడుతున్నారు. పెట్రోల్ ధరలు భగ్గుమనడం ఖాయమని వర్రీ అవుతున్నారు. లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు అవ్వొచ్చు అనే అనుమానాలు జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.