జైట్లీ కాదు గోయల్ : బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 04:39 AM IST
జైట్లీ కాదు గోయల్ : బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు అప్పగించారు. ఈ మేరకు 2019, జనవరి 23వ తేదీ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంటులో ఓటాన్ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడానికి 10 రోజుల ముందు మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. జైట్లీ స్థానంలో పీయూష్‌ గోయల్‌ ఫిబ్రవరి 1న లోక్‌సభలో ఓటాన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జైట్లీ అనారోగ్యం నేపథ్యంలో పార్లమెంట్‌లో రెండు బడ్జెట్లనూ(ఓటాన్, రైల్వే) గోయలే ప్రవేశపెట్టనున్నారు.

 

ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలను చూస్తున్న అరుణ్ జైట్లీ అనారోగ్యంతో అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారు. బడ్జెట్ సమయానికల్లా ఆయన వస్తారని అనుకున్నారు. కానీ, జైట్లీ రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రధాని మోడీ వెంటనే నిర్ణయం తీసుకున్నారు. 2018 ఏప్రిల్‌లో జైట్లీకి మూత్రపిండాలకు సంబంధించిన చికిత్స జరిగినప్పుడు కూడా జైట్లీ నిర్వహిస్తున్న శాఖలను పీయూష్ గోయల్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. 66ఏళ్ల అరుణ్ జైట్లీ కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు.

 

పీయూష్ గోయల్ ప్రస్తుతం రైల్వే శాఖతో పాటు బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నారు. వరుస రైలు ప్రమాద ఘటనలతో 2018లో సురేష్ ప్రభు.. రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రధాని మోడీ ఆ బాధ్యతలను పీయూష్ గోయల్‌కు అప్పగించారు.