Milk : పాలల్లో వెన్నశాతం తగ్గకుండా పాడిరైతులకు జాగ్రత్తలు

అంతేకాకుండా పంట అవశేషాలతో తయారు చేసిన సంపూర్ణ సమీకృత ఆహారం అందిస్తే పశువులకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి.

Milk : పాలల్లో వెన్నశాతం తగ్గకుండా పాడిరైతులకు జాగ్రత్తలు

Milk Dairy

Milk : పాడిపశువుల పాలధర పాలల్లో ఉండే వెన్న శాతం బట్టి నిర్ణయిస్తారు. పాలల్లో వెన్నశాతానికి అనేక కారణాలు ఉంటాయి. పశుగ్రాసాల లభ్యత తగ్గటం, వాతావరణంలో మార్పులు , సరిగా మేతమేయకపోవటం , అనారోగ్య సమస్యలు వీటి వల్ల పాలల్లో వెన్నశాతం తగ్గుతుంది. సాధారణంగా గేదెపాలలో వెన్నశాతం 6 నుండి 8శాతం వరకు ఉంటుంది. అదే దేశవాళి పాడి పశువుల పాలల్లో 4 నుండి 4.5శాతం, సంకర జాతి పాడి పశువుల పాలలో 3 నుండి 4శాతం వరకు ఉంటుంది.

పాడిపశువులలో జన్యు సామర్ధ్యాన్ని బట్టి వెన్న శాతం ఉంటుంది. పశువుల్లో జాతిని బట్టి పాలలో వెన్నశాతంలో మార్పులు, ఉంటాయి. గేదెల్లో ముర్రాజాతి, జాఫరాబాదికి జాతి గేదెల పాలలో వెన్నశాతం ఎక్కువగా ఉంటుంది. దేశవాళికి చెందిన ఆవులైన సాహివాల్, గిర్, థిమోని, ఒంగోలు జాతికి చెందిన పాడి పశువుల్లో పాల దిగుబడి తక్కువగా ఉండగా, వెన్నశాతం సంకర జాతి పాడి పశువుల కంటే అధికంగా ఉంటుంది. సంకర జాతి పాడి పశువుల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉండి వెన్నశాతం గేదెపాల కంటే, దేశవాళికి చెందిన ఆవు పాలకంటే తక్కువగా ఉంటుంది. వీటికి జన్యుపరమైన కారణంగా చెప్పవచ్చు.

పాలలో వెన్నశాతం పాడి పశువుల జాతి, వయస్సు, పాల దిగుబడి వాతావరణంలో మార్పుల వల్ల వెన్నశాతం తగ్గుతుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పాలలో వెన్నశాతం తగ్గుతుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. వీలైతే ఫ్యాన్లు కూలర్లు అమర్చుకుని పశువులకు ఎండవేడి లేకుండా చూడాలి. వేసివిలో పశువులను మేతకోసం బయట తిప్పితే వెన్నశాతం తగ్గుతుంది. పశువులు అలసట చెందిన శక్తి కోల్పాతాయి. గేదెలను రోజుకు 3సార్లు నీటితో కడగాలి. తద్వారా ఉష్ణోగ్రతలను తగ్గి పాలలో వెన్నశాతం పెరుగుతుంది.

పాడి పశువులకు ప్రతిరోజు 40 కిలోల వరకు పచ్చిమేత ఇవ్వాలి. ఇందులో మూడో భాగం పప్పు జాతి పశుగ్రాలను అందించాలి. మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి ఎండుగడ్డిని అందించాలి. ఎండుగడ్డి ఇవ్వటం వల్ల పాలల్లో వెన్నశాతం తగ్గకుండా చూడవచ్చు. పప్పుజాతి పశుగ్రాసాలైన బర్సీమ్, లూసర్న, అలసంద, పిల్లి పెసర, జనుము వంటి వాటిని గడ్డిజాతి పశుగ్రాసాలతో కలిపి మేపడం వల్ల పాలలో వెన్నశాతం పెరుగుతుంది. పశుగ్రాసాలను పూత దశలో ఉన్నప్పుడు కోసి పశువులకు వేస్తే వెన్నశాతం పెరుగుతుంది.

అంతేకాకుండా పంట అవశేషాలతో తయారు చేసిన సంపూర్ణ సమీకృత ఆహారం అందిస్తే పశువులకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. పత్తి గింజల చెక్క, వేరుశనగ చెక్క వంటి దాణా మిశ్రమాన్ని అందిస్తే తేలికగా జీర్ణం చేసుకుని పాలలలో వెన్నశాతం తగ్గకుండా ఉంటుంది. శీతాకాలంలో పశుగ్రాసాల లభ్యత తక్కువగా ఉన్నసమయంలో గ్రాసాలను చిన్నచిన్న ముక్కలుగా చేసి సైలేజ్ గా మాగుడు వేసుకోవాలి. దీనిని గ్రాసానికి ఇబ్బందైన సమయాల్లో ఉపయోగించుకోవచ్చు. మేతలో పీచుపదార్ధం తక్కువగా ఉంటే వెన్నశాతం తగ్గుతుంది. కాబట్టి పచ్చిమేతతోపాటు ఎండుగడ్డిని అందించాలి.

పాడపశువులు అనారోగ్యానికి గురైన సందర్భాల్లో వెన్నశాతం తగ్గుతుంది. అనారోగ్య పరిస్ధిని తక్కణమే గుర్తించి సరైన చికిత్స అందించటం వల్ల పశువు కోలుకుంటుంది. పాలల్లో నీళ్లు కలపటం వల్ల కూడా వెన్న శాతం తగ్గుతుంది. పాలల్లో నీళ్లు కలపకుండా ఉండటం మంచిది. పశువుల పెంపకం దారులు సరైన యాజమాన్యపద్దతులు పాటిస్తే అధిక లాభాలను పొందేందుకు అవకాశం ఉంటుంది.