అలా అయితే వారం తర్వాతే ఎన్నికల ఫలితాలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 29, 2019 / 09:33 AM IST
అలా అయితే వారం తర్వాతే ఎన్నికల ఫలితాలు

అసెంబ్లీ, లోక్ సభ ఎలక్షన్స్ లో వీవీప్యాట్ల లెక్కింపును పెంచాల్సిన అవసరం లేదని శుక్రవారం(మార్చి-29,2019) ఎలక్షన్ కమిషన్(ఈసీ) సుప్రీంకోర్టుకి తెలియజేసింది. వీవీప్యాట్ల లెక్కింపును పెంచితే మొత్తం లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడించడానికి అదనంగా ఆరు రోజులు అవసరం అని ఈసీ వెల్లడించింది.

ప్రతి నియోజకవర్గం పరిధిలో కనీసం 50 శాతం వీవీప్యాట్‌లను లెక్కించేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు సహా దాదాపు 21 పార్టీల నేతలు సుప్రీంని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్న న్యాయస్థానం.. వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించడంలో ఉన్న అభ్యంతరాలు తెలుపుతూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది.

దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం(ఈసీ).. ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతం ఉన్న విధానమే సరైందేనని, రాబోయే ఎన్నికల్లోనూ ఇదే విధానం పాటించనున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఒక అసెంబ్లీ స్థానంలో ఒక్క వీవీప్యాట్‌ను మాత్రమే ఎంచుకుని దానిలోని ఓటరు స్లిప్పులను లెక్కిస్తున్నారు. దీనివల్ల ఆ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో కేవలం 0.44 శాతం ఓటరు స్లిప్పులను మాత్రమే లెక్కిస్తున్నారు.

ఇన్ని తక్కువ స్లిప్పులు లెక్కిస్తే కచ్చితత్వం తెలియదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. తాము అన్నివిధాల పరీక్షలు జరిపి ఏ లోపం లేదని నిర్ణయించుకున్న తర్వాతే ప్రస్తుత పద్ధతినే అవలంభించాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు తెలిపింది