తేయాకు తోటలో కార్మికులతో కలిసి పనిచేసిన ప్రియాంకగాంధీ

తేయాకు తోటలో కార్మికులతో కలిసి పనిచేసిన ప్రియాంకగాంధీ

priyanka మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అసోంలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకప్పుడు అసోంలో వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తోంది. మార్చి-27నుంచి ఏప్రిల్-6వరకు మూడు దశల్లో అసోం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో..రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రెండో రోజు పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా నిన్న అసోం గిరిజన సంప్రదాయ నృత్యాలు ఆడిన ప్రియాంకా గాంధీ తాజాగా అసోం టీ తోటల్లో కార్మికులను కలిశారు.

అసోంలోని బిశ్వనాథ్‌లోని సాధురు టీ ఎస్టేట్ కి వెళ్లిన ప్రియాంక గాంధీ..అక్కడి కూలీలతో కలిసి కొద్దిసేపు పనిచేశారు. నుదుటికి బ్యాండ్.. వీపు వెనుక బుట్ట.. నడుముకు ఏప్రాన్‌ కట్టుకొని తానూ ఓ కార్మికురాలిగా మారి టీ ఆకులను కోస్తూ కార్మికులతో ప్రియాంక ముచ్చటించారు. ఆమెను చూసేందుకు చాలామంది కార్మికులు తరలివచ్చారు. ఆమెతో కలసి ఫొటోలు దిగారు.

అనంతరం టీ తోట పక్కనే కూర్చున్న ఆమె సరదాగా కార్మికులతో ముచ్చటించారు. వారియోగక్షేమాలు..సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఓ టీ ఎస్టేట్ కార్మికురాలి ఇంట్లో ప్రియాంకా గాంధీ భోజనం చేశారు. టీ ఎస్టేట్ కార్మికురాలి ఇంట్లో పసిబిడ్డని ముద్దుచేశారు ప్రియాంకా గాంధీ. ఆ కుటుంబంతో కలసి సెల్ఫీలు దిగారు. తేయాకు కూలీలు అసోంతోపాటు ఈ దేశానికి కూడా విలువైనవారని ఈ సందర్భంగా ప్రియాంకగాంధీ పేర్కొన్నారు. తేయాకు కార్మికుల హక్కులు పరిరక్షించేందుకు,వారికి గుర్తింపుతెచ్చేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటునందని ఈ సందర్భంగా ఆమె అన్నారు.