RBI Interest Rates : వడ్డీ రేట్లు.. ఎలాంటి మార్పులు చేయని ఆర్బీఐ

వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ ప్రకటన చేశారు. ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. రెపో రేటు 4 శాతం ఉండగా, రివర్స్‌ రెపో రేటు 3.5 శాతంగా ఉంది.

RBI Interest Rates : వడ్డీ రేట్లు.. ఎలాంటి మార్పులు చేయని ఆర్బీఐ

Rbi Rates

RBI Interest Rates :  అందరూ ఆసక్తిగా చూసిన ద్రవ్యపరపతి విధానాన్ని ఆర్బీఐ ప్రకటించింది. వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ ప్రకటన చేశారు. ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. రెపో రేటు 4 శాతం ఉండగా, రివర్స్‌ రెపో రేటు 3.5 శాతంగా ఉంది. ఎలాంటి మార్పులు చేయని కారణంగా వరుసగా ఆరోసారి వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టినా అది ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణం 5.7 శాతం పరిధిలో ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. జూన్‌లో ద్రవ్య విధాన కమిటీ అంచనాల ప్రకారం ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయని, కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతంగా ఉండనుందని అంచనా వేసింది. 2021-22లో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉండనుందని, ఇది రెండో త్రైమాసికంలో 5.9 శాతంగా, మూడో త్రైమాసికంలో 5.3 శాతంగా, నాలుగో త్రైమాసికంలో 5.8 శాతంగా ఉండనుందని అంచనా వేసింది. 2022-23 తొలి త్రైమాసికంలో 5.1 శాతంగా ఉండనున్నట్లు ఆర్బీఐ అంచనా వేసింది.

రెపో రేటు అంటే?
ఆర్‌బీఐ దగ్గర వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి రుణాలు తీసుకున్నపుడు వసూలు చేసే రేటును రెపో రేటు అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. స్వల్ప కాలికంగా దేశంలో ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెపో రేటును నిర్ణయిస్తారు. రెపో రేటును తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులకు త‌క్కువ‌ వడ్డీకే రుణాలు వ‌స్తాయి. ఈ ప్రభావంతో కంపెనీలకు, వ్యక్తులకు రుణాల వడ్డీ రేటును వాణిజ్య బ్యాంకులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి రెపో రేటు తగ్గించినా దానిని సామాన్యుల‌కు బ‌ద‌లాయించేందుకు బ్యాంకులు ఆసక్తి చూపకపోవచ్చు.

రివర్స్ రెపో రేటు అంటే?
బ్యాంకులు తమ దగ్గర డబ్బు ఎక్కువగా ఉందనుకుంటే దానిని రిజర్వ్ బ్యాంకుకు రుణాలుగా ఇవ్వొచ్చు. అలా వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకున్న మొత్తానికి ఆర్‌బీఐకి చెల్లించే వడ్డీ రేటునే రివర్స్ రెపో రేటు అంటారు. ఇది రెపో రేటు క‌న్నా తక్కువగా ఉంటుంది. మార్కెట్లో స్థిరత్వం లేన‌ప్పుడు బ్యాంకులు తమ అదనపు డబ్బును ఆర్‌బీఐ దగ్గర ఉంచి త‌క్కువైనా స‌రే స్థిర‌ వడ్డీ ఆదాయాన్ని పొందేందుకు ఆస‌క్తి చూపిస్తాయి.