GDP పతనానికి గబ్బర్​ సింగ్​ ట్యాక్స్ కారణం

  • Published By: venkaiahnaidu ,Published On : September 6, 2020 / 03:06 PM IST
GDP పతనానికి గబ్బర్​ సింగ్​ ట్యాక్స్ కారణం

దేశ ఆర్థిక స్థితి ఇలా ఉండటానికి మోడీ విధానాలే కారణమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ముఖ్యంగా జీడీపీ (దేశ స్థూల జాతీయోత్పత్తి) చారిత్రక కనిష్ఠానికి పడిపోవటానికి ‘గబ్బర్​ సింగ్​ ట్యాక్స్​’ కారణమని జీఎస్టీని ఉద్దేశించి విమర్శించారు.

ఎన్​డీఏ ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్​స్టీ)తో పేదలపై దాడి చేసిందన్నారు. కొన్ని లక్షల చిన్న పరిశ్రమలు, కోట్లాది మంది యువత ఉద్యోగాలు, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను ఇది నాశనం చేసింది. జీఎస్టీ అంటే ఆర్థిక పతనమే అని రాహుల్ అన్నారు.

తన తాజా వీడియో సిరీస్ లో మరోమారు కేంద్రంపై విమర్శలు గుప్పించిన రాహుల్….కొవిడ్​-19, లాక్ ​డౌన్​ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు -23.9కి పడిపోయింది. అసంఘటిత రంగంపై జీఎస్టీతో రెండో దాడి చేశారు. జీఎస్టీ నిజానికి యూపీఏ తెచ్చిన ఆలోచన. ఇందులో తక్కువ మొత్తంలో మాత్రమే పన్ను ఉంటుంది. కానీ ఎన్​డీఏ తెచ్చిన జీఎస్టీలో నాలుగు రకాల పన్నులు ఉన్నాయి. 28 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. ఇది అందరికీ అర్థమయ్యేది కాదు. చాలా క్లిష్టమైనదని రాహుల్ అన్నారు.

జీఎస్టీతో కేవలం 15 నుంచి 20 మంది సూటుబూటు వేసుకునే కార్పొరేట్లు లబ్ధి పొందుతున్నారన్నారు రాహుల్. చివరికి జీఎస్టీ ద్వారా సేకరించిన పన్నుల వాటాలను రాష్ట్రాలకు ఇవ్వలేని స్థితికి కేంద్రం చేరిందని విమర్శించారు. రాష్ట్రాలు.. టీచర్లు, ఇతర ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాయని రాహుల్​ అన్నారు. ఇండియన్ ఎకానమీలో జీఎస్టీ పూర్తిగా విఫలమైందని రాహుల్ గాంధీ అన్నారు.