ఆ పోస్టుకు ‘మరాఠి’ కండీషన్ సడలించండి : బాంబే హైకోర్టు

  • Published By: sreehari ,Published On : February 8, 2020 / 03:00 AM IST
ఆ పోస్టుకు ‘మరాఠి’ కండీషన్ సడలించండి : బాంబే హైకోర్టు

మహారాష్ట్రలో అగ్నిమాపక శాఖలోని ఓ పోస్టు ఆరేళ్లుగా ఖాళీగానే ఉంటోంది. ఎప్పటినుంచో ఈ పోస్టు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఫలితం శూన్యంగానే ఉంటోంది. కారణం.. ఆ పోస్టుకు నియమించే అభ్యర్థికి మరాఠి తప్పనిసరిగా తెలిసి ఉండాలి అనేది మహారాష్ట్ర ప్రభుత్వం కండీషన్ పెట్టింది. దాంతో అప్పటినుంచి మహారాష్ట్ర ఫైర్ సర్వీసెస్ ఫుల్ టైమ్ డైరెక్ట్ పోస్టుకు ఇప్పటివరకూ ఎవరిని నియమించలేదు.

దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై బాంబే హైకోర్టు విచారించింది. ఫైర్ సేఫ్టీకి సంబంధించి హైకోర్టు ప్రస్తావిస్తూ.. మహారాష్ట్ర ఫైర్ సర్వీసెస్ రాష్ట ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. మరాఠి భాష తప్పక తెలిసి ఉండాలి అనే నిబంధనను ప్రభుత్వం సడలించాలని కోర్టు సూచించింది. ఫైర్ సేప్టీ రూల్స్ సమస్యలపై సామాజికవేత్త షర్మిలా ఘుజే దాఖలు చేసిన పిల్ పై జస్టిస్ ఎస్.సి ధర్మాదికారి, జస్టిస్ ఆర్ఐ చాగ్లాతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. 

ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ (AG) అశతోష్ కుంభాకోణి కోర్టుకు వివరణ ఇస్తూ.. ఆ పోస్టు భర్తీపై మహారాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (MPSC)తో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్టు విన్నవించారు. ఫైర్ సేప్టీ సర్వీసెస్ లో డైరెక్టర్ పోస్టుకు నియమించే అభ్యర్థికి మరాఠి భాష తెలిసి ఉండాలనే నిబంధనపై చర్చించనున్నట్టు తెలిపారు. ఆ పోస్టుకు మరాఠి భాష తప్పక వచ్చి ఉండాలి అనే నిబంధన అవసరం లేదని జస్టిస్ ధర్మాదికారి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం భాష నిబంధనను తప్పనిసరి నుంచి సడలించాలని సూచించింది. అవసరమైతే ఆ అభ్యర్థి తర్వాత కూడా మరాఠి నేర్చుకోవచ్చునని ధర్మాసనం పేర్కొంది. 

మరోవైపు ఫైర్ సేప్టీలో డైరెక్ట్ పోస్టు ఖాళీగా ఉండటంతో ముంబై చీఫ్ ఫైర్ అధికారికి అదనంగా ఈ పోస్టును కట్టబెట్టారు. డిసెంబర్ 2014 నుంచి ఈ రెండు డ్యూటీలను చీఫ్ ఫైర్ అధికారే నిర్వర్తిస్తున్నారు. ముంబై మెగా సిటీలో బాధ్యతాయుతమైన ఈ పోస్టు నిర్వర్తించే అధికారికి అదనపు బాధ్యతలు భారంగా ఉండరాదని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై విచారణను మరో రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.