VAT on Petro: కేంద్రం నిర్ణయంతో పెట్రోల్ రేట్లు తగ్గిస్తున్న రాష్ట్రాలు

భారత్‌లో అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ లీటరు ధర రూ.110 దాటేసిన పరిస్థితి.

VAT on Petro: కేంద్రం నిర్ణయంతో పెట్రోల్ రేట్లు తగ్గిస్తున్న రాష్ట్రాలు

Petrol Rate

VAT on Petro: భారత్‌లో అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ లీటరు ధర రూ.110 దాటేసిన పరిస్థితి. ప్రతీనెలా కొత్త రికార్డులు సృష్టిస్తోండగా.. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ రిలీఫ్‌నిస్తూ లీట‌ర్ పెట్రోల్‌పై రూ.5, లీట‌ర్ డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం త‌గ్గించింది. అంతేకాదు.. రాష్ట్రాలను కూడా వ్యాట్ తగ్గించాలంటూ కోరింది కేంద్రం.

పెట్రోల్ ధర బ్రేకప్ విషయానికి వస్తే, అందులో పెట్రోల్ ధరలు పెరడానికి కేంద్రమెంత కారణమో.. రాష్ట్ర ప్రభుత్వాల హస్తం కూడా అంతే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ ధరలపై భారీగా పన్నులు వసూలు చేస్తున్నాయని, అవి కేంద్రం విధించే పన్ను కంటే చాలా ఎక్కువగా ఉంటాయనే విషయం చాలామందికి తెలియదు.

లేటెస్ట్‌గా కేంద్రం ధరలను తగ్గించడంతో రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా వ్యాట్ తగ్గించాలనే డిమాండ్ చేస్తున్నారు. క‌ర్ణాట‌క‌, అసోం, గుజ‌రాత్‌, గోవా, ఉత్త‌రాఖండ్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, ఒడిశా రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ల‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకంలో కోత విధించ‌గా.. రాష్ట్రంలో లీట‌ర్ పెట్రోల్, డీజిల్ మీద రూ.7 వ్యాట్ త‌గ్గిస్తున్నట్లు అసోం సీఎం హిమంత బిశ్వ‌శ‌ర్మ వెల్లడించారు.

గోవా ప్ర‌భుత్వం కూడా వ్యాట్ త‌గ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. లీట‌ర్ డీజిల్ లేదా పెట్రోల్ మీద వ్యాట్ రూ.7 త‌గ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.17, లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.12 త‌గ్గిస్తున్నట్లు గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ ప్రకటించారు. మ‌ణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ సైతం పెట్రోల్‌, డీజిల్‌ల‌పై రూ.7 వ్యాట్ త‌గ్గిస్తున్న‌ట్లు తెలిపారు.

కేంద్రం నిర్ణ‌యానికి అనుగుణంగా పెట్రోలియం ఉత్ప‌త్తుల‌పై వ్యాట్ రూ.7 త‌గ్గిస్తున్న‌ట్లు త్రిపుర సీఎం బిప్ల‌బ్ దేవ్ కుమార్ కూడా చెప్పారు. ఈ నిర్ణయంతో త్రిపుర‌లో లీట‌ర్ డీజిల్ రూ.17, లీట‌ర్ పెట్రోల్ రూ.12 త‌గ్గుతుంది. క‌ర్ణాట‌క సీఎం బొమ్మై కూడా పెట్రోల్, డీజిల్ ఉత్ప‌త్తుల‌పై వ్యాట్ త‌గ్గిస్తున్న‌ట్లు చెప్పారు. లీట‌ర్ డీజిల్/ పెట్రోల్ మీద రూ.7 వ్యాట్ త‌గ్గిస్తున్న‌ట్లు తెలిపారు.

గుజ‌రాత్ సీఎం భూపేంద్ర పాటిల్, బీహార్‌లో నితీశ్ కుమార్ సార‌ధ్యంలోని ఎన్డీఏ కూట‌మి స‌ర్కార్ పెట్రోల్‌పై వ్యాట్ త‌గ్గిస్తున్న‌ట్లు వెల్లడించారు. ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం రూ.2 వ్యాట్ త‌గ్గిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఒడిశాలో లీట‌ర్ పెట్రోల్ లేదా డీజిల్ మీద వ్యాట్ రూ.3 త‌గ్గ‌ిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. సిక్కిం రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా పెట్రోల్‌, డీజిల్‌ల‌పై వ్యాట్ రూ.7 త‌గ్గించినట్లుగా ప్రకటించింది.

అయితే, వ్యాట్ తగ్గించిన అన్నీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమో లేకుంటే, ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వమో ఉండగా.. ఒడిశా ప్రభుత్వం మాత్రమే అందులో లేకపోయినా.. రూ. 3 వ్యాట్ తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదివరకే వ్యాట్ తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మిగిలిన రాష్ట్రాల్లో ఎటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వాలు తీసుకుంటాయో వేచిచూడాలి.