శివసేన నేతలతో ప్రాణహాని..సుప్రీంకోర్టుకి కంగనా

శివసేన నేతలతో ప్రాణహాని..సుప్రీంకోర్టుకి కంగనా

Shiv Sena సోషల్ మీడియా వేదికగా మతపరమైన విమర్శలు చేసినందుకుగానూ మహారాష్ట్రలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. శివసేన నేతలతో తనకు ప్రాణ హాని ఉందని,ముంబైలో కోర్టుల్లో తనపై ఉన్న మూడు క్రిమినల్‌ కేసుల విచారణను తమ స్వరాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌కు బదలాయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కంగనా రనౌత్ సుప్రీంకోర్టుని కోరారు. ఈ మేరకు కంగనా తరపున ఆమె న్యాయవాది నీరజ్ శేఖర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

బాలీవుడ్‌ ప్రముఖులతో కుమ్మక్కైన శివసేన నేతలపై తాను చేస్తున్న ప్రకటనలతో సేన నేతలు తనను అంతమొందించాలని చూస్తున్నారని,ముంబైలోనే కేసుల విచారణ సాగితే తన ప్రాణాలకే ముప్పని పిటిషన్‌లో కంగనా పేర్కొన్నారు. తన ప్రాణాలకు ప్రమాదం ఉందనే కారణంతోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తనకు వైప్లస్‌ క్యాటగిరీ భద్రతను కల్పించిందని కంగనా గుర్తు చేశారు.

సోషల్ మీడియాలో మతపరమైన విమర్శలు చేసినందుకుగాను కంగన,ఆమె సోదరిపై రెండు క్రిమినల్ కేసులు నమోదైన విషయొం తెలిసిందే. కంగనా రనౌత్‌ తన ట్వీట్లతో హిందూ, ముస్లింల మధ్య సఖ్యత చెడిపోయేలా వ్యవహరించారని న్యాయవాది అలి కసీఫ్‌ ఖాన్‌ మెట్రపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఇక కంగనా, ఆమె సోదరి రంగోలి చందేల్‌లు తమ సోషల్‌ మీడియా వేదికగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ మున్వర్‌ అలీ సయ్యద్‌ కంగనాపై దేశద్రోహం కేసు పెట్టారు. వీటితోపాటు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణానంతరం ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్‌..తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిందని ప్రముఖ బాలీవుడ్ సినీ, గేయ రచయత జావేద్ అక్తర్ పరువు నష్టం దావా వేసారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం వెనక అనవసరంగా తన పేరును లాగారని ఆరోపిస్తూ జావేద్ అఖ్తర్ కంగనా రనౌత్ పై ముంబైలోని అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా కేసు వేసారు. ఈ కేసులను కొట్టేయాలంటూ గతంలో కంగనా బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. అక్కడ అనుకూల తీర్పు రాకపోవడంతో తాజాగా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది.