Mamata Banerjee : ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా.. అందరి చూపు దీదీ వైపే, ఏం జరగనుంది?

ఉత్తరాఖండ్ సీఎం రాజీనామాతో ఇప్పుడు అందరి చూపు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై పడింది. తీరత్ సింగ్ రావత్ సీఎం పదవికి రాజీనామా చేశారు.

Mamata Banerjee : ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా.. అందరి చూపు దీదీ వైపే, ఏం జరగనుంది?

Mamata Banerjee

Mamata Banerjee : ఉత్తరాఖండ్ సీఎం రాజీనామాతో ఇప్పుడు అందరి చూపు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై పడింది. తీరత్ సింగ్ రావత్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలలకే ఆయన పదవి నుంచి దిగిపోయారు. ఆయన రాజీనామాతో ఇప్పుడు అందరి చూపు వెస్ట్ బెంగాల్ సీఎం మమతపై పడింది. మమతా బెనర్జీ ఆరు నెలల వ్యవధిలో ఎమ్మెల్యేగా గెలుపొందాల్సి ఉన్న విషయం తెలిసిందే.

తీరత్ సింగ్ రాజీనామాపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. తీరత్ రావత్ ను బలిపశువుని చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆయనతో రాజీనామా చేయించారని, ఆ విధంగా నవంబర్ 5వ తేదీ కల్లా మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవకుండా, సీఎం పదవి నుంచి ఆమె దిగిపోయేలా చేశారని కాంగ్రెస్ ఆరోపించింది.

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ డిప్యూటీ లీడర్ కరణ్ మహ్రా తీరత్ సింగ్ రావత్ రాజీనామాపై తీవ్రంగా స్పందించారు. మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండా చూడటమే ప్రధాని మోడీ ప్రధాన లక్ష్యం అని, అందుకే తీరత్ రావత్ ను బలిపశువుని చేస్తూ ఆయనతో రాజీనామా చేయించారని అన్నారు. అయితే తీరత్ రావత్ తొలగింపు అంత సులువు కాదని ఆయన అన్నారు. తీరత్ రావత్ బైపోల్ లో కంటెస్ట్ చేయాల్సింది, కానీ చెయ్యలేదు అన్నారు.

ఇక్కడ ప్రధాన టార్గెట్ తీరత్ కాదు మమతా బెనర్జీ. ప్రధాని ఆమె చాలెంజ్ చేసే తీరు. మనందరికి తెలుసు ప్రధాని మోడీకి సవాల్ చేసే వారంటే నచ్చరు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు ఏమైంది మనందరికి తెలుసు అని మహ్రా అన్నారు. మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండా బీజేపీ, ప్రధాని మోదీ అడ్డుపడుతున్నారు. రాజ్యాంగ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. మమతా బెనర్జీ పోటీ చేయకుండా ఉండే వారు తీరత్ ను త్యాగం చేశారని చెప్పారు.

తీరత్ సింగ్ రావత్ గత నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ పెద్దలను కలిశారు. ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు.

తీరత్ సింగ్ రావత్ తన రాజీనామా లేఖను గవర్నర్ బేబీ రాణి మౌర్యాకు పంపారు. ప్రస్తుత కొవిడ్ సంక్షోభ పరిస్థితుల్లో ఉపఎన్నికలు పెట్టడం సాధ్యం కాదు. నా పదవికి రాజీనామా చేసేందుకు ఇదే సరైన సమయం నేను భావించాను అని లేఖలో తెలిపారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఒకరిని బీజేపీ ఎమ్మెల్యేలు తమ కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారు. తీరత్ సింగ్ రావత్ సిట్టింగ్ లోక్ సభ ఎంపీ. మార్చి 2022లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్ లో చోటు చేస్తుకున్న పరిణామాల ప్రభావం దీదీపైనా పడనుంది. తీరత్ సింగ్ రావత్, మమతా బెనర్జీ ఒకేరకమైన పరిణామాలు ఫేస్ చేయనున్నారు.

తీరత్ సింగ్ రావత్ సెప్టెంబర్ 10లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వాల్సి ఉంది. మే 5న మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ సీఎంగా ప్రమాణం చేశారు. నవంబర్ 5వ తేదీలోపు ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 1956ఓట్ల తేడాతో మమతా బెనర్జీ ఓటమిపాలయ్యారు. ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలు నిర్వహించే అవసరం లేకుండా తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. ఒకవేళ ఎన్నికల కమిషన్ రానున్న నాలుగు నెలల్లో వెస్ట్ బెంగాల్ లో ఎమ్మెల్యే సీటుకి ఉపఎన్నిక నిర్వహించకపోతే మమతా బెనర్జీ సైతం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. తన స్థానంలో మరొక సిట్టింగ్ ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని చేయాల్సి ఉంటుంది.

సువేందు అధికారి విజయాన్ని సవాల్ చేస్తూ గత నెలలో కోల్ కతా హైకోర్టుని మమతా బెనర్జీ ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో కోర్టు తన తీర్పుని రిజర్వ్ లో ఉంచింది. త్రివేంద్ర సింగ్ రావత్ స్థానంలో తీరత్ రావత్ మార్చి 10న ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణం చేశారు. అక్కడి నుంచి 6 నెలల లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఇప్పటికే 3 నెలల గడిచిపోయింది. మరో మూడు నెలల్లో తీరత్ సింగ్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఇంతలోనే ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో వేడి పెంచారు.