గొప్ప సందేశం, 2రూపాయల న్యూస్ పేపర్ కొంటే మాస్కు ఉచితం

  • Published By: naveen ,Published On : July 22, 2020 / 03:31 PM IST
గొప్ప సందేశం, 2రూపాయల న్యూస్ పేపర్ కొంటే మాస్కు ఉచితం

కరోనా వైరస్ మహమ్మారి మానవాళికి ముప్పుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోటిన్నర మంది ఈ వైరస్ బారినపడ్డారు. లక్షలమందిని కరోనా బలితీసుకుంది. వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ ప్రాణాంతక వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రెండే మార్గాలు. అందులో ఒకటి మాస్కులు ధరించడం, రెండోది భౌతికదూరం పాటించడం. కరోనా నుంచి కాపాడుకోవాలంటే మాస్కు తప్పనిసరి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డాక్టర్లు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నా ఇంకా కొంతమందిలో మార్పు రావడం లేదు.

మాస్కు ధరించాలని విజ్ఞప్తి:
మాస్కులు లేకుండానే రోడ్ల మీదకు వస్తున్నారు. స్వేచ్చగా తిరుగుతున్నారు. కరోనాతో గేమ్స్ ఆడుతున్నారు. తద్వారా తమ ప్రాణాలను రిస్క్ లో పడేసుకోవడమే కాకుండా ఇతరులనూ డేంజర్ లోకి నెట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మాస్కు ధరించడంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, మాస్కుల ప్రాముఖ్యతను తెలిపేందుకు ఓ దిన పత్రిక వినూత్న ప్రయత్నం చేసింది. న్యూస్ పేపర్ కొన్నవాళ్లకి ఉచితంగా మాస్కులు ఇస్తోంది. దయచేసి మాస్కు ధరించండి అని పాఠకులకు విజ్ఞప్తి చేస్తోంది.

మాస్కు ప్రాముఖ్యత తెలిసేలా:
జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో రోషిణి(Roshni) అనే ఉర్దూ(Urdu) దిన పత్రిక ఉంది. ఈ దినపత్రిక యాజమాన్యం గొప్ప సందేశం ఇస్తోంది. ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితుల్లో మాస్కుల ఆవశ్యకత, ప్రాముఖ్యత తెలియజేస్తోంది. ఇందుకోసం దినపత్రిక కొన్నవారికి ఉచితంగా ఒక మాస్కు ఇస్తోంది. ఓ ప్లాస్టిక్ కవర్ లో భద్రంగా మాస్కును ఉంచి న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీ మీద దాన్ని అతికించి ఇస్తున్నారు. దాని మీద ”మాస్కు వాడకం చాలా ముఖ్యం” అని రాసి ఉంది.

”ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలకు సందేశం ఇవ్వడం ముఖ్యంగా భావించాము. మాస్కు ధరించడం యొక్క ప్రాముఖ్యత గురించి జనాలకు తెలియజేయడానికి ఇదొక మంచి మార్గంగా భావించాము” అని రోషిణి పత్రిక ఎడిటర్ జహుర్ షోరా తెలిపారు.

ప్రశంసించాల్సిన విషయమే:
ఈ న్యూస్ పేపర్ ప్రయత్నానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. న్యూస్ పేపర్ యాజమాన్యంపై ప్రశంసలు కురిపించారు. చాలా మంచి పని చేస్తున్నారని కితాబిచ్చారు. ”న్యూస్ పేపర్ ధర రూ.2. పేపర్ కొన్నవారికి ఉచితంగా మాస్కు ఇస్తున్నారు. మాస్కు వాడకం ప్రాముఖ్యతను తెలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రశంసించాల్సిన విషయం. ఇళ్లలో న్యూస్ పేపర్ చదువుతున్న వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ, ఇది చాలా పెద్ద సందేశం పంపుతుంది” అని శ్రీనగర్ వాసి జుబేర్ అహ్మద్ చెప్పారు.

Coronavirus in Spain: Face masks in Spain will be compulsory in ...

కరోనా నుంచి కాపాడుకోవాలంటే రెండే మార్గాలు:
జమ్ముకాశ్మీర్ లో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం(జూలై 20,2020) ఒక్కరోజే అక్కడ అత్యధికంగా 751 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 254మంది కరోనాతో చనిపోయారు. 6వేల 122 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 8వేల 274మంది కరోనా నుంచి కోలుకున్నారు. శ్రీనగర్ జిల్లాలో సోమవారం ఒక్కరోజే అత్యధికంగా 171 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, కచ్చితంగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి కాపాడుకోవాలంటే మన ముందున్న బలమైన సాధనాలు ఈ రెండే అని చెప్పారు.