రాజ‌కీయాల్లోకి సుమ‌ల‌త : ఎంపీగా పోటీ

  • Published By: vamsi ,Published On : March 2, 2019 / 06:00 AM IST
రాజ‌కీయాల్లోకి సుమ‌ల‌త : ఎంపీగా పోటీ

లోక్ సభ ఎన్నికలు వస్తున్న వేళ కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దివంగత కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి, కన్నడ నటుడు అంబరీష్‌ చనిపోవడంతో ఆ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భార్య ప్రముఖ హీరోయిన్ సుమలత భావిస్తుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారంటూ కన్నడ నాట చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అంబరీష్‌ దూరమైన విషాదం నుంచి ఇంకా కోలుకోనప్పటికీ.. ప్రజల ఒత్తిడి మేరకు రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించిన సుమలత. భర్త అంబరీష్‌ ప్రాతినిధ్యం వహించిన మాండ్య నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నుండి టిక్కెట్ ఆశిస్తున్న ఆమె ఆ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతుంది. 

కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి అధికారంలో ఉండగా.. అందులో భాగంగా సీట్ల సర్దుబాటులో మాండ్య స్థానంను జేడీఎస్‌కు కేటాయించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ కీలక నేత, మంత్రి డీకే శివకుమార్‌ ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానంటూ సుమలత స్పష్టం చేసింది. సుమలత భర్త కన్నడ నటుడు అంబరీష్‌  మాండ్య జిల్లాలోనే జన్మించారు. 1994లో రాజకీయాల్లో అడుగు పెట్టిన ఆయన కాంగ్రెస్‌ తరపున పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. 1998, 99, 2004లో మాండ్యకు ప్రాతినిథ్యం వహించారు. నటుడిగా, సమాజ సేవకుడిగా పేరు సంపాదించిన అంబరీష్ కు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా చరిష్మా ఉంది. ఈ క్రమంలో మాండ్య నుంచి పోటీ చేస్తే సుమలత తప్పక గెలుస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. 

మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ కుమారస్వామి రాజకీయ ప్రవేశం చేయాలని భావిస్తుండగా ఆయన కూడా మాండ్య లోక్ సభ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మద్దతు ఇస్తామని బీజేపీ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సుమలతకు ఫోన్‌ చేసి చెప్పినట్లు వార్తలు రాగా ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది.