ఆర్థం చేసుకోండి…సోనియాజీ ఆ సూచన ఉపసంహరించుకోండి

  • Published By: venkaiahnaidu ,Published On : April 8, 2020 / 03:42 PM IST
ఆర్థం చేసుకోండి…సోనియాజీ ఆ సూచన ఉపసంహరించుకోండి

కరోనాపై పోరాటంలో ప్రధాని మోడీకి 5 సూచనలు చేస్తూ సోనియాగాంధీ మంగళవారం ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. టీవీ,ప్రింట్ మీడియాల్లో ప్రభుత్వ ప్రకటనలు బ్యాన్ చేయడం, 20వేల కోట్లతో నిర్మిస్తున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేయడం,ప్రెసిడెంట్,మంత్రుల అధికారిక విదేశీ టూర్లను నలిపివేయడం వంటివి సోనియా సూచించిన వాటిలో ఉన్నాయి.(ఎసెన్షియల్ సర్వీసెస్ : మద్యం హోం డెలివరీకి సీఎం గ్రీన్ సిగ్నల్)

అయితే  మీడియాకు సంబంధించి ప్రధానికి సోనియాగాంధీ చేసిన ఒక సూచన పత్రికలకు మరణ శాసనం రాసేదిగా ఉంది. సోనియా సూచనపై పలు మీడియా సంస్థలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రెండేళ్లపాటు ప్రభుత్వంగానీ, పబ్లిక్‌రంగ సంస్థలు గానీ పత్రికలకు ప్రకకటనలు విడుదల చేయరాదనే ప్రతిపాదనను సోనియాగాంధీ  ఉపసంహరించుకోవాలని ది ఇండియన్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (INS) బుధవారం ఒక ప్రకటనలో కోరింది. వార్తాపత్రికలకు ప్రకటనల నిలిపివేత ఆర్థిక సెన్సార్‌షిప్ కిందకు వస్తుందని INS అభిప్రాయపడింది.

ప్రభుత్వం జారీచేసే ప్రకటనల సొమ్ము… ప్రభుత్వం మొత్తం వ్యయంలో ఎంతో ఉండదని, కానీ పత్రికల మనుగడకు మాత్రం అది ఎంతో పెద్దమొత్తమనిINS ఓ ప్రకటనలో తెలిపింది. చురుకైన ప్రజాస్వామ్యానికి పత్రికలు ఎంతో అవసరమని గుర్తు చేసింది. సర్కారు వేజ్‌బోర్డుల ద్వారా వేతనాలు నిర్ణయించే, మార్కెట్ శక్తులు వేతనాలు నిర్ణయించని ఏకైక రంగం ఇదేనని ఐఎన్ఎస్ తెలిపింది. ఈ పరిశ్రమ పట్ల ప్రభుత్వానికి బాధ్యత ఉందని గుర్తుచేసింది.

ఫేక్ న్యూస్, వక్రీకరణల ప్రస్తుత యుగంలో ప్రింట్ మీడియా ప్రభుత్వానికి, విపక్షాలకు ఉత్తమ వేదిక అని తెలిపింది. మాంద్యం వల్ల, డిజిటల్ మీడియా దాడుల వల్ల ప్రకటనలు, సర్కులేషన్ ఆదాయం ఇదివరకే తగ్గిపోయిందని, ఇక లాక్‌డౌన్ కారణంగా పత్రికలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయని వివరించింది. విశ్వమహమ్మారిపై ప్రాణాలొడ్డి మీడియా సిబ్బంది వార్తలు అందిస్తున్న సమయంలో సోనియాగాంధీ చేసిన సూచన ఆందోళన కలిగిస్తున్నదని, ఆ సూచనను ఆమె ఉపసంహరించుకోవాలని INS విజ్ఞప్తి చేసింది. రేడియో ఆపరేటర్ల సంఘం, న్యూస్ బ్రాడ్‌కాస్టర్ల సంఘం మంగళవారమే ఆమె సూచనను ఖండిస్తూ ప్రకటనలు జారీచేయగా,INSవాటికి మద్దతు తెలిపింది. ఒకరోజు ఆలస్యంగా సొంత ప్రకటనను విడుదల చేసింది.