Pfizer టీకాను భద్రపరచడంలో చిక్కులు

  • Published By: madhu ,Published On : November 12, 2020 / 07:12 AM IST
Pfizer టీకాను భద్రపరచడంలో చిక్కులు

Pfizer Covid vaccine : కరోనా మహమ్మారికి టీకా సిద్ధమయ్యిందని ఫైజర్ ప్రకటించింది. కానీ విచిత్రం ఏమంటే టీకాను భద్రపరచటమే కష్టంగా మారిందట. స్థానికంగా ఉండే ఫార్మసీలకు, ఆసుపత్రులకు ఫైజర్ కరోనా టీకా పంపిణీ ఇప్పుడప్పుడే సాధ్యం కాదంటున్నారు. అందుకు కొన్ని చిక్కులు కూడా ఉన్నాయంటున్నారు. అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ ఫైజర్, జర్మనీ కి చెందిన మరో ఫార్మా కంపెనీ బియోన్ టెక్ కలిసి కరోనా మహమ్మారికి టీకా సిద్ధం చేశాయి.



టీకా పంపిణీలో తొలి ప్రాధాన్యం :-
మూడో దశ పరీక్షల్లో తమ టీకా 90 శాతం కరోనా వైరస్‌ను విజయవంతంగా కట్టడి చేయగలదని తేలిందని ఫైజర్ ప్రకటించింది. ఈ నెలాఖరులోగా టీకా భద్రతకు సంబంధించిన డేటా కూడా అందుబాటులోకి వస్తుంది. సోమవారం ఫైజర్ కంపెనీ ప్రకటన రాగానే స్టాక్ మార్కెట్ సూచీలు ఉవ్వెత్తున రికార్డు స్థాయిల్లో పెరిగాయి. అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి కోసం ఈ రెండు ఫార్మా కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. అనుమతులు రాగానే అత్యవసరమైన వారికీ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హెల్త్ కేర్ వర్కర్స్, నర్సింగ్ హోముల్లో ఉండేవారికి టీకా పంపిణీలో తొలి ప్రాధాన్యం ఇస్తారు.



ఫైజర్ టీకా చాలా సంక్లిష్టం :-
కానీ, ఫైజర్ టీకా చాలా సంక్లిష్టం, సున్నితమైన వ్యవహారంగా ఉంది. అమెరికాలోని అత్యాధునిక వసతులున్న పెద్దపెద్ద ఆసుపత్రుల్లో కూడా టీకాను భద్రపరచడం కష్టం అంటున్నారు. ఎందుకంటే మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద దాన్ని భద్రపరచాలని చెబుతున్నారు. అలాంటి ఏర్పాట్లు చాలా చోట్ల ఉండవు. అమెరికా గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని వెంటనే పంపిణీ చేయడం కష్టమని చెబుతున్నారు. అమెరికాలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక పేద దేశాల్లో దీన్ని భద్రపరచడం అసాధ్యం కావచ్చు. ఫైజర్ టీకా పంపిణీకి ఇదొక పెద్ద అడ్డంకిగా మారింది.



భద్రపరిచే సౌకర్యాలు :-
అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీకా తయారు చేయడం వల్ల దీన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచాల్సి ఉందని చెబుతున్నారు. వైరస్ ను ఎదుర్కోడానికి రోగనిరోధక వ్యవస్థను చైతన్య పరచాలి. అందుకోసం అత్యాధునిక టెక్నాలజీ తో సింథెటిక్ ఎం ఆర్ ఎన్ ఏ ఉపయోగించారు. అందువల్లనే టీకాను మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాల్సి వస్తోందని ఫార్మా కంపెనీ వర్గాలు తెలిపాయి. అందుకే ఇప్పుడు ఫైజర్ టీకా పంపిణీ కోసం కోల్డ్ చైన్ సిద్ధం చేయడం ఒక పెద్ద సవాలుగా మారింది. నగరాల్లో ఉండే పెద్దపెద్ద ఆసుపత్రుల్లోనే ఈ టీకాను భద్రపరిచే సౌకర్యాలు లేవని టీకా నిపుణులు చెబుతున్నారు.



అమెరికా ప్రభుత్వంతో చర్చలు :-
ఈ అడ్డంకుల కారణంగా ఫైజర్ కంపెనీ అమెరికా ప్రభుత్వం తో చర్చలు జరుపుతోందని కంపెనీ ప్రతినిధి కిమ్ బెకానర్ చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి టీకాను రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు. అమెరికాలోనే కాక ఫైజర్ టీకా జర్మనీ, బెల్జియం, మరికొన్ని దేశాలకు కూడా ఎగుమతి చేయాల్సి ఉంది. ఫ్రీజ్ చేసిన టీకా వైల్స్ ను డ్రై ఐస్ లో పెట్టి రోడ్డు మార్గంలో, విమానాల్లో రవాణా చేయాల్సి ఉంది.



మైనస్ 70 నుంచి 80 డిగ్రీల టెంపరేచర్ :-
పంపిణీ కేంద్రాల్లో దాన్ని మైనస్ 70 నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే భద్రపరచాలి. వాక్సిన్ వైల్స్ తీసుకెళ్లే ట్రక్కులు, విమానాల్లో కూడా ఇదే ఉష్ణోగ్రతలు మైంటైన్ చెయ్యాలి. ఇదీ ఫైజర్ ఫార్మా కంపెనీ విడుదల చేసిన సమగ్ర ప్రణాళిక. అందుకు తగిన ఏర్పాట్లు ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుంది. ఫైజర్ కంపెనీ కూడా వాక్సిన్ భద్రపరచడానికి, రవాణా చేయడానికి చాలా ఏర్పాట్లు చేసుకుంటోంది. టీకా సిద్ధమయ్యింది. దీన్ని పంపిణీ చేయడం, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాల పని.