INLD Rally: బీజేపీని మిత్రపక్షాలు అందుకే వదిలేస్తున్నాయి.. ప్రతిపక్షాల ర్యాలీలో తేజశ్వీ యాదవ్
బిహార్లోని పూర్ణియా విమానాశ్రయంలో మీటింగ్ పెట్టి.. విమానాశ్రయమే లేదని అమిత్ షా అంటున్నారని, ఇంతకంటే చోద్యం మరొకటి ఉండదని అన్నారు. దేశంలో ముస్లింలు-హిందువులకు మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, వాటిని అడ్డుకుని దేశంలో శాంతి నెలకొల్పాలంటే బీజేపీకి వ్యతిరేకంగా అందరూ ఏకమవ్వాల్సిన అవసరం ఉందని తేజశ్వీ అన్నారు.

They leave NDA for save the Constitution and democracy says Tejashwi yadav
INLD Rally: భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే జనతాదళ్ యూనియన్, శివసేన, శిరోమణి అకాలీ దళ్ వంటి పార్టీలు భారతీయ జనతా పార్టీ స్నేహానికి స్వస్తి చెప్పి ఎన్డీయే నుంచి బయటికి వచ్చాయని బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజశ్వీ యాదవ్ అన్నారు. మాజీ ఉప ప్రధాన మంత్రి దేవీలాల్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) ఆధ్వర్యంలో చేపట్టిన విపక్ష ర్యాలీలో తేజశ్వీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని అతిపెద్ద అబద్ధాల కోరు పార్టీయని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి తీరాలని అన్నారు.
ఐఎన్ఎల్డీ నిర్వహించిన ఈ ర్యాలీ బీజేపీని ఓడించాలనే భావ సారూప్యత కలిగిన విపక్షాలను ఏకం చేసేందుకు మైలు రాయిగా నిలుస్తుందని తేజశ్వీ అన్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ సహా విపక్ష పార్టీలన్నీ ఏకమై 2024లో భారతీయ జనతా పార్టీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమిగా ఏర్పడేందుకు దేశంలోని అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన కోరారు.
ఇక అమిత్ షా గురించి తేజశ్వీ మాట్లాడుతూ బిహార్లోని పూర్ణియా విమానాశ్రయంలో మీటింగ్ పెట్టి.. విమానాశ్రయమే లేదని అమిత్ షా అంటున్నారని, ఇంతకంటే చోద్యం మరొకటి ఉండదని అన్నారు. దేశంలో ముస్లింలు-హిందువులకు మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, వాటిని అడ్డుకుని దేశంలో శాంతి నెలకొల్పాలంటే బీజేపీకి వ్యతిరేకంగా అందరూ ఏకమవ్వాల్సిన అవసరం ఉందని తేజశ్వీ అన్నారు.