రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్…5గురు గుజరాత్ ఎమ్మెల్యేలు రాజీనామా

  • Published By: venkaiahnaidu ,Published On : March 15, 2020 / 01:42 PM IST
రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్…5గురు గుజరాత్ ఎమ్మెల్యేలు రాజీనామా

ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ పార్టీని ఆపరేషన్ కమలం ఉక్కిరిబిక్కిరిచేస్తున్న సమయంలో గుజరాత్ లో విపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. గుజరాత్ లో ఇవాళ(మార్చి-15,2020)ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మార్చి-26,2020న జరగనున్న రాజ్యసభ ఎన్నికల ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జైపూర్ కి తరలిస్తున్న ప్రస్తుత సమయంలో ఐదుగురి ఎమ్మెల్యేల రాజీనామా ఇప్పుడు గుజరాత్ లో హాట్ టాపిక్ గా మారింది.

మొదటగా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను ఆదివారం గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ కు అందజేశారు. ఈ నలుగురు రాజీనామా లేఖలను స్పీకర్ కు సమర్పించిన అనంతరం తాను కూడా రాజీనామా చేసినట్లు మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రవీణ్ మారో కన్ఫర్మ్ చేశారు. దీంతో మొత్తం రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 5కి చేరింది.

మరోవైపు గుజరాత్ లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అసెంబ్లీలోని సంఖ్యాబలం ప్రకారం రెండు సీట్లు మాత్రమే గెలిచే అవకాశమున్నప్పటికీ బీజేపీ..ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి క్రాస్ ఓటింగ్ జరిగి మూడో సీటు తమకే దక్కవచ్చనే భావనతో మూడు స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టింది బీజేపీ.

మరోవైపు కాంగ్రెస్ ఒక్క రాజ్యసభ సీటుని మాత్రమే గెల్చుకునే అవకాశమున్నప్పటికీ..ఆ పార్టీ తరపున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రెండు రాజ్యసభ సీట్లను గెలవాలంటే కాంగ్రెస్ కు 74ఓట్లు కావాల్సి ఉంటుంది. గుజరాత్ లో స్వతంత్ర్య అభ్యర్థిగా ఉన్న జిగ్నేష్ మేవానీ శుక్రవారం తన మద్దతును కాంగ్రెస్ కు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే క్రమంలో భాగంగా ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ శనివారం…14మంది గుజరాత్ ఎమ్మెల్యేలను మొదటి బ్యాచ్ గా జైపూర్ కి తరలించింది. ఆదివారం సాయంత్రానికి20-22ఎమ్మెల్యేల మరో బ్యాచ్ జైపూర్ కి చేరుకోనుంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో బీజేపీకి ప్రస్తుతం 103మంది ఎమ్మెల్యేలు ఉండగా,కాంగ్రెస్ 73మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.