తాజ్ సమాధులకు దూరంగా ట్రంప్ నిలబడ్డారంట

  • Published By: venkaiahnaidu ,Published On : February 26, 2020 / 02:36 AM IST
తాజ్ సమాధులకు దూరంగా ట్రంప్ నిలబడ్డారంట

రెండు రోజులు భారత్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు. అయితే తాజ్‌మహల్‌లోని సమాధుల దగ్గరకు ట్రంప్‌ వెళ్లలేకపోయారు. అక్కడకు వెళ్లే దారి ఇరుకుగా, ఎత్తు తక్కువగా ఉండటమే దీనికి కారణమట. ట్రంప్‌ ఎత్తు కన్నా ఆ మార్గం ఎత్తు తక్కువగా ఉందని, ఇరుకుగా కూడా ఉందని ఆయన భద్రతా సిబ్బంది హెచ్చరించారు. దీంతో ఆయన తాజ్‌మహల్‌లోని షాజహాన్‌-ముంతాజ్‌ల సమాధుల దగ్గరకు వెళ్లలేకపోయారు. ట్రంప్‌-మెలానియా జంటకు పర్యాటక గైడ్‌గా వ్యవహరించిన నితిన్‌కుమార్‌ సింగ్‌(36) ఈ విషయం వెల్లడించారు.

తాజ్‌మహల్‌ సమాధి గురించి, షాజహాన్‌-ముంతాజ్‌ల ప్రేమ గురించి ట్రంప్‌ దంపతులకు వివరించానని నితిన్‌ చెప్పారు. షాజహాన్‌, ముంతాజ్‌ సమాధులకు చేసిన ‘మడ్‌ ప్యాక్‌ ట్రీట్‌మెంట్‌’ గురించి మెలానియా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారన్నారు. మరోసారి తాజ్‌మహల్‌ను సందర్శిస్తామని ట్రంప్‌ దంపతులు చెప్పారన్నారు.

See Also>>ఇవాంకా ట్రంప్ దిగిన తాజ్ మహాల్ ఫొటోలో తేడా గుర్తించారా? ఫొటోషాప్ చేశారా? ఏంటి?

తాజ్‌ అందాలకు ట్రంప్ దంపతులు మైమరిచిపోయారని చెప్పారు. పాలరాతి కట్టడం తాజ్‌ను చూడగానే అద్భుతమంటూ ట్రంప్‌ కొనియాడారని చెప్పారు. ఆగ్రాకు చెందిన నితిన్‌ 12 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నారు. 50 మంది గైడ్లను ఇంటర్వ్యూ చేసిన అమెరికా రాయబార కార్యాలయం చివరకు నితిన్‌ను ఎంపిక చేసింది. అమెరికా అధ్యక్షుడి కుటుంబానికి తాజ్‌మహల్‌ గురించి వివరించే అదృష్టం దక్కింది. నా జీవితంలో మరిచిపోలేని రోజు ఇది అని నితిన్‌ ఉద్వేగంగా చెప్పారు