ముస్లిం దేశాల్లో యాంటీ ఫ్రాన్స్ నిరసనలు…యూపీలో హై అలర్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : November 4, 2020 / 10:57 AM IST
ముస్లిం దేశాల్లో యాంటీ ఫ్రాన్స్ నిరసనలు…యూపీలో హై అలర్ట్

UP on high alert amid growing anti-France protests ముహమ్మద్ ప్రవక్త కార్జూన్ పై ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై ముస్లిం దేశాల్లో నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో హైఅలర్ట్ విధించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడి వ్యాఖ్యలపై యూపీలోనూ నిరసనలు చెలరేగే అవకాశాల దృష్ట్యా మతపరమైన సమావేశాలపై నిఘా ఉంచాలని ఇంటెలిజెన్సు ఏజెన్సీలు, పోలీసు, స్పెషల్ టాస్కు ఫోర్సు, లోకల్ ఇంటెలిజెన్సు విభాగాలను యోగి సర్కార్ ఆదేశించింది.
యూపీ పశ్చిమప్రాంతంలో మతపరమైన సమావేశాలపై దృష్టి సారించి ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని యూపీ డీజీపీ అన్ని జిల్లాల పోలీసు అధికారులను ఆదేశించారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలేంటి
కొద్ది రోజుల క్రితం మహమ్మద్‌ ప్రవక్త వివాదాస్పద కార్టూన్లను విద్యార్ధులకు చూపిస్తున్నారంటూ ఆగ్రహించిన 18 ఏళ్ల ముస్లిం యువకుడు ఒక ఫ్రెంచ్‌ టీచర్‌ను హత్య చేసిన విషయం తెలిసిందే. ఇస్లాం మతస్థులు ప్రవక్తగా భావించే మహమ్మద్‌ కార్టూన్లను స్కూల్‌లో ప్రదర్శించారన్న కారణంతో టీచర్‌ను ముస్లిం యువకుడు తలనరికి దారుణంగా చంపాడు.ఈ హత్యకు వ్యతిరేకంగా, భావ ప్రకటన స్వచ్ఛకు మద్దతుగా ఫ్రాన్స్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. లౌకికవాదం గురించి చర్చలు కూడా జరిగాయి.

ఈ సమయంలో ఉపాధ్యాయుడి హత్యను ఇస్లామిక్‌ టెర్రరిస్టు దాడిగా అభివర్ణించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్. మహమ్మద్‌ ప్రవక్త వివాదాస్పద కార్టూన్‌ ల ప్రదర్శనను మేక్రాన్ సమర్ధించారు. ఒక వర్గం వారి మనోభావాలు దెబ్బతింటాయని భావ ప్రకటనా స్వేచ్ఛను వదులుకోలేమని మేక్రాన్‌ అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడం అంటే ఫ్రాన్స్‌ సమగ్రతను దెబ్బతీయడమేనని మేక్రాన్‌ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌లోని 60 లక్షలమంది ముస్లింలు ప్రధాన జీవన స్రవంతి నుంచి దూరంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అసలు ఇస్లాం మతమే సంక్షోభంలో ఉందని ఈ సందర్భంగా మేక్రాన్ వ్యాఖ్యానించారు.

మేక్రాన్ వ్యాఖ్యలపై ముస్లిం దేశాల ఆగ్రహం
ఫ్రెంచ్‌ ఉపాధ్యాయుడి హత్య తర్వాత ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌ చేసిన కామెంట్లు ఇస్లామిక్‌ దేశాలకు ఆగ్రహం తెప్పించాయి. మేక్రాన్‌ ప్రకటనకు నిరసనగా ఫ్రాన్స్‌లో తయారైన వస్తువులను బహిష్కరించాని పలు ముస్లిం దేశాలు పిలుపునిచ్చాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మత విశ్వాసాలను గుర్తించడం లేదని, ఫ్రాన్స్‌లో లక్షలమంది ముస్లింల స్వేచ్ఛను హరిస్తున్నారని టర్కీ, పాకిస్తాన్‌ దేశాలు ఆరోపించాయి. ఇప్పటికే కువైట్‌, జోర్డాన్‌, ఖతార్‌ లలోని కొన్ని షాపుల నుంచి ఫ్రెంచ్‌ దేశానికి చెందిన వస్తువులను తొలగించారు. లిబియా, సిరియా, గాజా ప్రాంతాలలో ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే ముస్లింలలోని ఒక ‘అతివాద’ వర్గం వస్తు నిషేధంపై అనవసరమైన ప్రకటనలు చేస్తోందని ఫ్రాన్స్‌ విదేశాంగశాఖ వ్యాఖ్యానించింది.

ఫ్రాన్స్ లో వరుస ఉగ్రదాడులు

ఫ్రాన్స్ అధ్యక్షుడి వ్యాఖ్యల నేపథ్యంలో ఫ్రాన్స్ లో వరుస ఉగ్రదాడులు జరుగుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో మూడు దాడులు జరిగాయి. గత గురువారం(అక్టోబర్-29,2020)ఫ్రాన్స్‌లోని నీస్ సిటీలో నాట్రేడేమ్‌ చర్చి సమీపంలో “అల్లాహ్ అక్బర్” అని పెద్దగా అరుస్తూ ఓ ఆగంతకుడు జరిపిన క‌త్తి దాడిలో మొత్తం ముగ్గురు చ‌నిపోగా, అనేక మంది గాయ‌ప‌డ్డారు.

గట్టిగా బదులు తీర్చుకున్న ఫ్రాన్స్
ఉగ్రవాదుల దాడికి గురైన ఫ్రాన్స్ అక్టోబర్-30న గట్టిగా బదులు తీర్చుకుంది. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని సహించేది లేదని స్పష్టం చేస్తూ… సెంట్రల్ మాలీలో ఉన్న జీహాదిస్టుల పని పట్టింది. బర్ఖేన్ ఉగ్ర శిబిరంపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది ఫ్రాన్స్. ఈ ఎయిర్ స్ట్రైక్ లలో ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా యాభై మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని ఫ్రాన్స్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వారి దగ్గర్నుంచి భారీ స్థాయిలో ఆయుధ సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకుంది ఫ్రాన్స్. సోమవారం ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ఈ విషయాన్ని వెల్లడించారు. నైజర్ లోని మాలి ప్రాంతంలో పెద్ద ఎత్తున వాహనాలు మోహరించాయని డ్రోన్లు ఇచ్చిన సమాచారంతో తాము ఎయిర్ స్ట్రైక్స్ చేశామని తెలిపారు. ఈ ఘటనలో ఉగ్రవాదులకు చెందిన 30 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని వివరించారు.

అయితే మిసైల్స్ నుంచి తప్పించుకోవడానికి ఉగ్రవాదులు చెట్ల కింద దాక్కున్నారని.. వారిని డ్రోన్ల సాయంతో పట్టుకున్నామని వివరించారు. కాగా, ఇది ఇస్లామిక్ వ్యతిరేక తిరుగుబాటు ఉద్యమానికి పెద్ద అని విశ్లేషకులు భావిస్తున్నారు. యూరప్ లో పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడుతున్న అన్సురల్ ఇస్లాం గ్రూపు (అల్ ఖైదా అనుబంధ సంస్థ) కు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ సంస్థతో పాటు దాని చీఫ్ గలే కు కూడా ఇది ఊహించని దెబ్బ అని చెబుతున్నారు. నైజర్ లోని పలు ప్రాంతాల్లో తిష్ట వేసుకుని ఉన్న ఉగ్రవాదులను అంతం చేయడానికి అమెరికా సాయంతో ఫ్రాన్స్ ఇప్పటికే అక్కడ భారీగా బలగాలను మోహరించిన విషయం విధితమే.

ఫ్రాన్స్ కు అండగా భారత్ సహా పలు దేశాలు

ఉగ్రవాదంపై పోరులో ఫ్రాన్స్ కి అండగా ఉంటామని భారత్,అమెరికా సహా పలు ప్రపంచదేశాలు తెలిపాయి. ఫ్రాన్స్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులను తీవ్రంగా ఖండించాయి.