టీకా యుద్ధం: మా వ్యాక్సిన్‌లను నీరే అంటారా? సీరంపై భారత్ బయోటెక్ సీరియస్!

టీకా యుద్ధం: మా వ్యాక్సిన్‌లను నీరే అంటారా? సీరంపై భారత్ బయోటెక్ సీరియస్!

కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడమే లక్ష్యంగా రెండు కోవిడ్-19 వ్యాక్సీన్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) ఆమోదం తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఆమోదం పొందిన టీకాల్లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ ఉండగా.. కోవిషీల్డ్‌ను ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారుచేశాయి. కోవాగ్జిన్ భారత్ దేశీయంగా తయారుచేసిన టీకా. అయితే సీరం సీఈఓ ఫైజర్, మోడర్నా, కోవిషీల్డ్ తప్ప మిగతా వ్యాక్సిన్లు అన్నీ జస్ట్ నీళ్లులాంటివే అంటూ కొట్టిపారేశారు. ఇక్కడ నుంచే అసలైన మాటల యుద్దం మొదలైంది.

బయోటెక్నాలజీ రంగంలో ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదిగిన భారత్ బయోటెక్‌పై ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అనే యూకే సంస్థలు తయారు చేసిన టీకాను ఇండియాలో అమ్ముకునేందుకు సీరమ్ సంస్థ ఈ ప్రచారాన్ని ప్రారంభించారని ఆరోపిస్తున్నారు. ఆక్స్ ఫర్డ్ టీకాను ఇండియాలో మార్కెట్ చేసుకునేందుకు హక్కులు పొంది, రాత్రికి రాత్రి కుబేరులైపోదామనే ఆశతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన టీకాపై బురదజల్లుతున్నారని మిగతా కంపెనీలు అంటున్నాయి.

ఈ క్రమంలోనే కరోనా టీకా అంశం ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుందని, అయితే ఈ పాలిటిక్స్‌తో తమకు ఏ మాత్రం సంబంధం లేదని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా స్పష్టంచేశారు. కొవాగ్జిన్ 200 శాతం సేఫ్ అని, భరోసా ఇచ్చారు. విదేశీ సంస్థలు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ల కన్నా తాము తయారు చేసిన కొవాగ్జిన్ ఎంతో ఉత్తమమైనదని చెప్పుకొచ్చారు. కొవాగ్జిన్ 200 శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని చెప్పారు.

ప్రయోగ దశల్లో ఇతర వ్యాక్సిన్లు 60 నుంచి 70 శాతం దుష్ప్రభావాలు చూపించగా.. కొవాగ్జిన్ మాత్రం 10 శాతమే దుష్ప్రభావాలు చూపిందని చెప్పుకొచ్చారు. దుష్ప్రభావాలను ఎదుర్కొనేందుకు వాలంటీర్లకు ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంస్థలు నాలుగు గ్రాముల పారాసిటమాల్ ఇస్తోంది. మేం ఏ వాలంటీర్‌కి కూడా పారసిటమాల్ ఇవ్వలేదు. కొవాగ్జిన్ 200 శాతం సేఫ్ అని నేను కచ్చితంగా చెప్పగలను’ అని కృష్ణ ఎల్లా చెప్పుకొచ్చారు.

సిరమ్ వాదనలను తప్పుబట్టిన భారత్ బయోటెక్.. సీరమ్ సంస్థ వైద్యరంగంలో సాధించిన విజయాలేమిటో? భారత్ బయోటెక్ సాధించిన విజయాలేమిటో మీడియా ముందు పెట్టింది. తమ ట్రయల్స్ డేటాను వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా- ఆక్స్ ఫర్డ్ ట్రయల్స్ డేటాలోని లోపాలనూ ఎత్తి చూపింది. వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకుని రావడానికి ఎంత కష్టపడ్డామో మాకే తెలుసన్నారు. కోవాగ్జిన్ కరోనాకు అసలైన మందు అని పేర్కొన్న కృష్ణ యల్లా.. అది 36 వేల మంది వాలంటీర్లు కృషికి ఫలితం అన్నారు.