వలస కూలీల కోసం 12వేల బస్సులు…ప్రియాంక విజ్ణప్తిపై స్పందించిన యోగి

  • Published By: venkaiahnaidu ,Published On : May 18, 2020 / 01:33 PM IST
వలస కూలీల కోసం 12వేల బస్సులు…ప్రియాంక విజ్ణప్తిపై స్పందించిన యోగి

లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన తమ రాష్ట్రానికి చెందిన వలసకూలీలను తిరిగి స్వస్థలాలకు చేర్చేందుకు వివిధ రాష్ట్రాలకు 12,000బస్సలను పంపాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇళ్లకు వెళ్లాలనుకున్న వలసకూలీల లిస్ట్ లను అందించాలని యోగి ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను కోరింది.

వలస కూలీలను రాష్ట్రాలకు తరలించేందుకు యూపీలోని ప్రతి ఒక్క జిల్లా మెజిస్ట్రేట్ 200బస్సులను పంపనున్నారు. దీంతో మొత్తం రాష్ట్రంలోని 75 జిల్లాల మెజిస్ట్రేట్ లు అదనంగా 15వేల బస్సులు పంపనున్నారు. ఉత్తరప్రదేశ్ లోకి చేరుకున్న వెంటనే వలసకూలీలకు ఆహారం,త్రాగునీరు అందించాలని జిల్లా అధికారులను యోగి ప్రభుత్వం ఆదేశించింది.

మరోవైపు వలసకూలీలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు యోగి ప్రభుత్వం ఇప్పటివరకు 590 శ్రామిక్ రైళ్లను బుక్ చేసినట్లు సమాచారం. మరోవైపు, వలస కార్మికుల నిమిత్తమై 1,000 ప్రత్యేక బస్సులు నడిపేందుకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చేసిన విజ్ఞప్తికి కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంగీకరించారు. వలస కూలీలకు సహాయం అందించడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్సులను ఏర్పాటు చేశామని, సరిహద్దుల్లో వాటిని ఆపేశారని,వాటికి అనుమతినివ్వాలని, బస్సులకు అనుమతినిచ్చి కార్మికులకు సహాయపడదాం అంటూ ఈ నెల 16 న ప్రియాకం గాంధీ యోగిని కోరారు. దీంతో సీఎం యోగి సోమవారం ప్రియాంక గాంధీ అభ్యర్థనకు ఆమోదం తెలిపారు. బస్సుల వివరాలు, డ్రైవర్ల పేర్లు, నంబర్లు తమకు పంపాలంటూ కాంగ్రెస్ కార్యాలయానికి యోగి ప్రభుత్వం లేఖ రాసింది. 

వందల కిలోమీటర్లు నడిచే క్రమంలో,ప్రమాదకరమైన పరిస్థితుల్లో సొంతరాష్ట్రాలకు ప్రయాణించే క్రమంలో రోడ్డు,రైలు ప్రమాదాల్లో వందల సంఖ్యలో వలసకూలీలు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. గత వారం ఉత్తరప్రదేశ్ లోని అవురియా దగ్గర్లోని హైవేపై జరిగిన యాక్సిడెంట్ లో 24 మంది మృతి చెందడం, 36 మంది గాయాల పాలైన విషయం తెలిసిందే.

మరోవైపు, వలస కార్మికుల తరలింపు అంశంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై రాజకీయాలు చేయడం తగదని కాంగ్రెస్ ఫై యోగి ఫైర్ అయ్యారు. కరోనా కల్లోల కాలంలో కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు అందరూ గర్హించాలి అని ఆయన అన్నారు. అవురియా ప్రమాదానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ఆయన పరోక్షంగా విమర్శించారు.

వలస కార్మికుల మరణానికి కారణమైన ఒక ట్రక్కు పంజాబ్ నుంచి, మరొక ట్రక్కు రాజస్థాన్ నుంచి వచ్చిందని ఆయన తెలిపారు. ఆ రెండు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే. ఏదైనా సంస్థగానీ, పార్టీగానీ వలస కార్మికులను పంపించాలని దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తామని యోగి స్పష్టం చేశారు. 500 బస్సుల్లో కూలీలను తరలిస్తుంటే యూపీ సర్కారు సరిహద్దుల్లో ఆపేసిందని రాజస్థాన్ పర్యాటక మంత్రి విశ్వేంద్ర సింగ్ ఆరోపించిన మరుసటి రోజే సీఎం యోగి ఈ విధంగా స్పందించారు.