IAFని సొంత ట్యాక్సీలా వాడుకుంది మోడీనే!

  • Published By: venkaiahnaidu ,Published On : May 10, 2019 / 06:56 AM IST
IAFని సొంత ట్యాక్సీలా వాడుకుంది మోడీనే!

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ భారత యుద్ధ నౌక INS విరాట్ ను తన వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకున్నారని,యుద్ధ నౌకను విహారయాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫుల్ సీరియస్ అయింది.మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఎలక్షన్ ట్రిప్స్ కోసం ఎయిర్ ఫోర్స్ జెట్ లను తన సొంత ట్యాక్సీలాగా వాడుకున్న మోడీ… అత్యంత తక్కువగా 744 రూపాయలు చెల్లించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. తన పాపాలు చూసి తనే భయపడుతున్న ప్రధాని ఇతరులపై వేలెత్తి చూపుతున్నాడని కాంగ్రెస్ విమర్శించింది.గురువారం(మే-9,2019) కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆర్టీఐ ఆధారంగా వచ్చిన ఓ మీడియా రిపోర్ట్ ను ప్రస్తావిస్తూ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : మోడీకి మమత బంపరాఫర్: ఆరోపణలు నిరూపించలేకపోతే 100 గుంజీలు తియ్యాలి
  
ఆర్టీఐ ఆధారంగా వచ్చిన ఆ మీడియా రిపోర్ట్ లో….నరేంద్రమోడీ ప్రధాని అయినప్పటినుంచి 2019 జనవరి వరకు 240 అనధికార దేశీయ ట్రిప్పులకు గాను IAFకి బీజేపీ కేవలం 1.4 కోట్లు మాత్రమే చెల్లించింది. ఉదాహరణకు..  జనవరి-15,2019న మోడీ ప్రయాణానికి గాను బీజేపీ 744 రూపాయలు చెల్లించింది.కొన్ని సందర్భాల్లో చాలా తక్కువ అమౌంట్ ను బీజేపీ IAFకి చెల్లించింది.

మోడీ వ్యాఖ్యలను రిటైర్డ్ నేవీ అడ్మిరల్ వినోద్ పస్రీచా కూడా ఖండించారు.రాజీవ్ గాంధీ, ఆయన భార్య సోనియా గాంధీ రెండు రోజుల అధికార పర్యటనలో భాగంగానే ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో ప్రయాణించారని తెలిపారు. రాజీవ్ గాంధీ 1984-89లో ప్రధానిగా ఉన్నప్పుడు ఐఎన్‌ఎస్ విరాట్‌కు పస్రీచా ఇన్‌ఛార్జిగా ఉన్నారు. రాజీవ్ తమ నౌకను సందర్శించినప్పుడు అన్ని అధికార లాంఛనాలను అనుసరించామని, ఆయన వెంట విదేశీయులు లేదా అతిథులెవరూ రాలేదని గురువారం పస్రీచా తెలిపారు.ఎవరూ సెలవులు గడిపేందుకు విరాట్ లోకి ప్రవేశించలేదన్నారు.

పస్రీచాతోపాటు నౌకా దళం మాజీ అధిపతి అడ్మిరల్ ఎల్ రాందాస్ కూడా మోడీ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. రాజీవ్ కుటుంబ వ్యక్తిగత అవసరాల కోసం యుద్ధ నౌకలను ఎక్కడికీ దారి మళ్లించలేదని, వాటిలో విదేశీయులెవరూ ప్రయాణించలేదని రాందాస్ చెప్పారు. నాటి రాజీవ్ పర్యటనకు సంబంధించిన ఫొటో కూడా తన దగ్గర ఉన్నదని తెలిపారు.

నాడు త్రివేండ్రంలో జరిగిన జాతీయ క్రీడల బహుమతి ప్రధానోత్సవంలో రాజీవ్ గాంధీ పాల్గొన్నారని, అనంతరం ఆయన ద్వీపాల అభివృద్ధి సంస్థ సమావేశానికి అధ్యక్షత వహించేందుకు అధికార పర్యటనపై ఐఎన్‌ఎస్ విరాట్‌లో లక్షద్వీప్ బయలుదేరారని రాందాస్ తెలిపారు. ఆరోజు రాత్రి ప్రధానికి తాను విందు ఇచ్చానని, దీనిని ధ్రువీకరించే ఫొటో తన దగ్గర ఉందని రాందాస్ తెలిపారు.
Also Read : భారతదేశపు డివైడర్… మోడీపై టైమ్స్ వివాదాస్పద హెడ్ లైన్

మరోవైపు ఐఎన్‌ఎస్ విరాట్ లక్షద్వీప్‌ లో ఆగిన మాట నిజమేనని, అయితే రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ ఆ నౌకలో విహారం చేయలేదని నాడు ద్వీపాలకు అధికారిగా ఉన్న వజాహత్ హబీబుల్లా తెలిపారు. నాడు రాజీవ్, సోనియా ఒక హెలికాప్టర్‌లో ఒక ద్వీపానికి వచ్చారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన హబీబుల్లా గుర్తు చేసుకున్నారు. ప్రధానికి భద్రత కల్పించేందుకు ఐఎన్‌ఎస్ విరాట్‌ను సముద్రంలో మోహరించారు.

సముద్రం మధ్యలో ప్రధానికి భద్రత కల్పించేందుకు యుద్ధ నౌకలు తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదు. లక్షద్వీప్‌లో అధికార సమావేశం ముగిసిన తరువాత అక్కడే ఉండాలని రాజీవ్‌గాంధీ నిర్ణయించుకున్నారు. అక్కడ కొందరు అతిథులు ఆయనను కలుసుకున్నారు. అయితే విదేశీయులు లేదా అతిథులను ఐఎన్‌ఎస్ విరాట్‌లోనికి అనుమతించలేదు అని హబీబుల్లా వివరించారు.