డబ్బులిస్తా..రాజధాని నిర్మాణ పనులు మొదలెట్టండి

  • Published By: chvmurthy ,Published On : November 26, 2019 / 02:25 AM IST
డబ్బులిస్తా..రాజధాని నిర్మాణ పనులు మొదలెట్టండి

ఏపీ రాజధాని అమరావతిలో నిలిచిపోయిన భవన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతలు కల్పన కోసం చేపట్టిన నిర్మాణాలను అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు తిరిగి చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  క్షేత్ర స్థాయిలో వాస్తవాలకు తగినట్లు ప్రాధాన్యతా క్రమంలో వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, అనవసర ఖర్చులకు పోకుండా నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్లాలని సూచించారు.  సీఆర్‌డీఏ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన పనులు, చేసిన ఖర్చులు, వివిధ నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయనే అంశాలపై  నవంబర్ 25, సోమవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఉన్నతాధికారులతో పూర్తి స్ధాయి సమీక్ష నిర్వహించారు. 

రాజధానిలో పూర్తికావస్తున్న నిర్మాణ పనులపై మొదట దృష్టిపెట్టి వాటిని పూర్తి చేయాలని.. ఇందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అనవసర వ్యయం అవుతోంది అనుకున్న నిర్మాణ పనులకు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లి ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించాలని సూచించారు. రాజధానిలో కొనసాగించబోయే పనుల పరిమాణం, అంచనా వ్యయాల తగ్గింపు అంశాలపై ఐఐటీ నిపుణుల సలహాలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణంపై మాత్రం నిపుణుల కమిటీ నివేదిక వచ్చాకే నిర్ణయం తీసుకోనున్నారు.  ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణ పనులు డిసెంబరులోను, హ్యాపీనెస్ట్ పనులు జనవరి 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. రాజధానిలో ప్రధాన అనుసంధాన రహదారి పక్కనే ఏడంతస్తులుగా నిర్మిస్తున్న సీఆర్డీఏ కార్యాలయ భవనం పనులూ త్వరలో ప్రారంభించనున్నారు. రాజధానిలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేసి వారికి అప్పగించాలని సమావేశంలో నిర్ణయించారు.

రోడ్ల డిజైన్‌కు ఐఐటీ సలహా
సీఆర్‌డీఏ పరిధిలో రోడ్ల డిజైన్లపై అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. ప్లానింగ్‌లో ఎక్కడా తప్పుల్లేకుండా చూడాలని ఆదేశించారు. రహదారుల ప్రతిపాదనల విషయంలో ఖర్చు, డిజైన్ల వంటి అంశాలపై ఐఐటీ వంటి ప్రముఖ సంస్థల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.  రాజధానిని బయటి ప్రాంతాలతో అనుసంధానించేందుకు అవసరమైనంత మేరకే రహదారుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఎనిమిది, ఆరు వరుసలుగా నిర్మించాలనుకున్న రహదారుల వెడల్పు తగ్గించాలని, భవిష్యత్తులో అవసరమైనప్పుడు విస్తరించుకునేందుకు వీలుగా అటూ ఇటూ ఖాళీ ప్రదేశం వదిలిపెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు.  కృష్ణా నది సమీపంలో కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రవాహ పరిస్థితిపై అధికారులతో చర్చించారు. వైకుంఠపురం రిజర్వాయర్‌ నిర్మాణం, నీటి వినియోగం వంటి అంశాలపై ఆరా తీశారు. రాజధానిలో రోడ్ల నిర్మాణానికి పోగా మిగిలిన భూమిని సుందరీకరించాలని సూచించారు.

రాజధాని నిర్మాణానికి రూ.1.09 లక్షల కోట్లు ఖర్చవుతాయని గత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వాటిలో రూ.44 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. వాటిలో చాలా పనులు మొదలై వివిధదశల్లో ఉన్నాయి. ఈ సమావేశంలో వాటిపై కూడా చర్చించారు. 2050 నాటికి రాజధానిలో 35 లక్షల జనాభా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ ప్రణాళికలు రూపొందించారని, ప్రస్తుతం రాజధాని జనాభా 1.5 లక్షలు మాత్రమే ఉన్నందున అంత భారీ రహదారులు ఇప్పుడే అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చారు. మొత్తం రాజధాని ప్రాంతాన్ని 13 జోన్లుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారని, వాటిలో భాగంగానే ఎల్పీఎస్ లేఅవుట్ లలో మౌలిక వసతులూ అభివృద్ధి చేయాల్సి ఉంటుందని,  ఇందుకు రూ.15 వేల కోట్లు ఖర్చవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏడాదికి రూ.5 వేల కోట్ల చొప్పున, వచ్చే మూడేళ్లలో ఈ మొత్తం నిధులు సమకూర్చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిధులు గ్రాంటుగా ఇవ్వాలని, బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలంటే ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని ప్రతిపాదించారు. నిపుణులతో సంప్రదించి తగిన ప్రతిపాదనలతో రావాలని సీఎం సూచించారు.  

జనవరి నుంచి హ్యాపీనెస్ట్ పనులు  
రాజధానిలో శాఖమూరు పార్క్ పక్కనే సీఆర్ డీఏ తలపెట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. 1200 ఫ్లాట్లు నిర్మించి ప్రజలకు విక్రయించేందుకు సీఆర్ డీఏ ఈ ప్రాజెక్టు తలపెట్టింది. ఈ ప్రాజెక్టుకు రెండుదశల్లో బుకింగ్ నిర్వహించగా… ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఫ్లాట్లన్నీ బుక్కయ్యాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి, శంకుస్థాపన చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధానిలో పనులన్నీ నిలిపివేయడంతో, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టూ ఆగిపోయింది. ఫ్లాట్లు బుక్ చేసుకున్నవారు ఈ ప్రాజెక్టుపైనా సందిగ్ధంలో పడ్డారు. వారి సందేహాలకు తెరదించుతూ… ప్రాజెక్టును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.