కాంగ్రెస్‌కి కొత్త కష్టం, కోమటి రెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్, కారణం ఆ పదవేనా?

  • Published By: naveen ,Published On : September 28, 2020 / 05:35 PM IST
కాంగ్రెస్‌కి కొత్త కష్టం, కోమటి రెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్, కారణం ఆ పదవేనా?

komati reddy brothers.. కాంగ్రెస్‌లో వర్గపోరు ఎప్పుడూ ఉండేదే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడికక్కడ వర్గ పోరుతో పార్టీ ఇబ్బందులు పడుతోంది. జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వర్గానికి ఆ పార్టీ క్యాడర్‌లో మంచి గుర్తింపు ఉంది. ఇద్దరూ మాస్ లీడర్లే. రాష్ట్ర స్థాయిలో కూడా కొంత కేడర్‌ను మెయింటెన్ చేస్తుంటారు ఈ సోదరులు. మీడియా మనసెరిగి.. ఎప్పుడు ఏం మాట్లాడితే హాట్ టాపిక్ అవుతుందో తెలుసుకొని.. అధికార పార్టీతో పాటు సొంత పార్టీ నేతలపై కామెంట్స్ చేయడం రివాజు. ఇదంతా పాత విషయం.. తాజా ఈ ఇద్దరు బ్రదర్స్ మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

టీపీసీసీ పీఠం విషయంలోనే బ్రదర్స్ మధ్య అంతర్గత విభేదాలు:
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఆ ఒక్క నియోజకవర్గ పరిధిలో ఎంపీగా వెంకట్‌రెడ్డి ‌పర్యటించకపోవడం వెనుక కారణం అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడమే అంటున్నారు. టీపీసీసీ పీఠం విషయంలోనే బ్రదర్స్ మధ్య అంతర్గత విభేదాలు తలెత్తయని టాక్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకట్ రెడ్డి ఓటమి పాలుకావడం, రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించడంతో పీసీసీ రేస్‌లో ముందుకొచ్చారట రాజగోపాల్ రెడ్డి. కానీ, ఆ తర్వాత ఆయన పార్టీ మారతానని బహిరంగంగా చెప్పారు.

పీసీసీ రేస్‌లో వెనుకబడ్డ రాజగోపాల్ రెడ్డి:
వెంకట్‌రెడ్డి ఎంపీగా గెలవడంతో పీసీసీ రేస్‌లో రాజగోపాల్ రెడ్డి వెనకబడిపోయారట. అయినా సొంత తమ్ముడిని కంట్రోల్ చేయడంలో అన్న విఫలమయ్యారని కొంతమంది పార్టీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. ఈ కారణాలే పీసీసీ పీఠాన్ని దూరం చేసే అవకాశాలున్నట్లు వెంకట్ రెడ్డి భావిస్తున్నారట. ఇక వెంకట్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు కావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నా రాజగోపాల్‌రెడ్డి ఎప్పుడూ అన్నకి బహిరంగంగా మద్దతు పలికిన సందర్భం లేదు. కొన్నిసార్లు మాత్రం ఇద్దరిలో ఎవరికైనా పీసీసీ ఇచ్చినా ఓకే అని చెప్పిన బ్రదర్స్ ఇప్పుడు మళ్లీ నోరు మెదపడం లేదు. పీసీసీ పీఠం విషయంలో ఇద్దరు బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తునట్లు చెప్పుకుంటున్నారు.

అన్నదమ్ములు కలిసి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు:
తమ పార్టీ ఎలాగో అధికారంలో లేదని, ఇప్పుడు అనవసర దూకుడు ఎందుకని, అందుకే సైలెంట్ గా ఉన్నారని బ్రదర్స్ అనుచరులు కొంతమంది వాదిస్తున్నారు. పీసీసీ మార్పు అంశం హైకమాండ్ పరిశీలిస్తున్నందున ఇప్పుడు తొందరపడొద్దనే భావనలో కోమటిరెడ్డి సోదరులు ఉన్నారట.

ఇప్పటికే బీజేపీ గూటికి వెళ్తారనే ప్రచారంతో డ్యామేజ్‌ అయిన తన ఇమేజ్‌ను ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాపాడుకోవాలని చూస్తున్నారట. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మునుగోడు నియోజకవర్గం కూడా ఒకటి. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా, భువనగిరికి వెంకట్‌రెడ్డి ఎంపీగా ఉన్నా, కలిసి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు.

అసంతృప్తిలో కేడర్, అనుచరులు:
తమ తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ పేరుతో రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో చేనేత కార్మికులకు రూ.70 లక్షల విలువైన నిత్యావసరాలు పంపిణీ చేశారు. చేనేత కార్మికుల నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపారు. నియోజకవర్గ పరిధిలో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు.

ఆ కార్యక్రమాలకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరు కాకపోవడంతో వారి మధ్య సఖ్యత లేదనే ప్రచారం జోరందుకుంది. అన్నను తమ్ముడు ఆహ్వానించడం లేదా? ఆహ్వానించినా అన్న రావడం లేదా అనే చర్చ సాగుతోంది. వీరిద్దరూ కలసి కార్యక్రమాల్లో పాల్గొనకపోడంతో కేడర్‌, అనుచరులు అసంతృప్తి చెందుతున్నారు.