బీజేపీలో చేరిన డీకే అరుణ: మహబూబ్‌నగర్ నుంచి పోటీ!

రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నాయకురాలు డీకే అరుణ బీజేపీలో చేరారు.

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 01:52 AM IST
బీజేపీలో చేరిన డీకే అరుణ: మహబూబ్‌నగర్ నుంచి పోటీ!

రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నాయకురాలు డీకే అరుణ బీజేపీలో చేరారు.

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్క నేత వరుసగా వీడిపోతున్నారు. కాంగ్రెస్‌‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా మరో నేత పార్టీని వీడారు. రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నాయకురాలు డీకే అరుణ బీజేపీలో చేరారు. మార్చి 19 మంగళవారం రాత్రి  ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో ఆమె చేరారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని ఆమె భావిస్తోంది.

తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే అరుణ ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో డీకే అరుణ బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నుండి కాంగ్రెస్ పార్టీ తరపున డీకే.అరుణ కీలక నేతగా ఉన్నారు. 1978 నుంచి గద్వాలపై డీకే కుటుంబం హవా నడిపిస్తూ వచ్చింది. ఇంటర్మీడియట్ వరకు చదివిన ఆమె గద్వాల సీనియర్ కాంగ్రెస్ నేత భరత సింహారెడ్డిని వివాహమాడారు. వీరి కుటుంబంలో అందరూ రాజకీయ నేతలు కావడం గమనార్హం. ఆమె పుట్టినిల్లు, మెట్టినిల్లు రాజకీయాలకు నిలయాలు అని చెప్పవచ్చు.

1996లో మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం నుండి డీకే.అరుణ పోటీ చేసి ఓడిపోయారు. 1998లోనూ పరాజయం చెందారు. 1999లో గద్వాల అసెంబ్లీకి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. 2004లో ఎస్పీ తరపున గద్వాల నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి అరుణ సంచలనం సృష్టించారు. 2007లో ఎస్పీ బహిష్కరించడంతో 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఆమె గెలుపొందారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పని చేశారు. 2014లో గద్వాల నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో డీకే అరుణ ఓటమి పాలయ్యారు.