Maharashtra: ఉద్ధవ్ థాకరేపై ప్రతీకారం తీర్చుకున్నాను.. స్వయంగా ఒప్పుకున్న దేవేంద్ర ఫడ్నవీస్

మీతో ఎవరైనా అధికారాన్ని పంచుకుని, గంటల తరబడి మీతోనే ఉండి, మీతో పాటు ఎన్నికై.. ఉన్నట్టుండి మీకు వెన్నుపోటు పొడిస్తే ఊరుకుంటారా? వారికి తప్పనిసరిగా అందుకు తగిన బుద్ధి చెప్పాల్సిందే. లేదంటే రాజకీయాల్లో రాణించలేము. రాజకీయాల్లో మంచిగా ఉండడం చాలా అవసరం. అయితే దాన్ని అలుసుగా తీసుకుని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటే, మిమ్మల్ని మోసం చేస్తుంటే చూస్తూ ఉండకూడదు

Maharashtra: ఉద్ధవ్ థాకరేపై ప్రతీకారం తీర్చుకున్నాను.. స్వయంగా ఒప్పుకున్న దేవేంద్ర ఫడ్నవీస్

If anyone betrays me, I will take revenge says Fadnavis

Maharashtra: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్ధవ్ బలాసాహేబ్ థాకరే) అధినేత ఉద్ధవ్ థాకరేపై ప్రతీకారం తీర్చుకున్నట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. తాజాగా ఓ టీవీ ఛానల్‭కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తననెవరైనా మోసం చేస్తే, ప్రతీకారం తప్పదని, అదే ఉద్ధవ్ థాకరే విషయంలో జరిగిందని అన్నారు. ప్రతీకారం కొన్ని విషయాల్లో తప్పు కాదని, లేదంటే రాజకీయాల్లో రాణించలేమని ఆయన అన్నారు. అంతే కాకుండా అందుకు తాను గర్వపడుతున్నట్లు కూడా ఫడ్నవీస్ చెప్పడం గమనార్హం.

ప్రతీకార రాజకీయాల గురించి దేవేంద్ర ఫడ్నవీస్ తనదైన శైలిలో స్పందిస్తూ ‘‘మీతో ఎవరైనా అధికారాన్ని పంచుకుని, గంటల తరబడి మీతోనే ఉండి, మీతో పాటు ఎన్నికై.. ఉన్నట్టుండి మీకు వెన్నుపోటు పొడిస్తే ఊరుకుంటారా? వారికి తప్పనిసరిగా అందుకు తగిన బుద్ధి చెప్పాల్సిందే. లేదంటే రాజకీయాల్లో రాణించలేము. రాజకీయాల్లో మంచిగా ఉండడం చాలా అవసరం. అయితే దాన్ని అలుసుగా తీసుకుని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటే, మిమ్మల్ని మోసం చేస్తుంటే చూస్తూ ఉండకూడదు. అలాంటి వారికి వారి స్థానమేదో చూపించాలి. నేను అదే ఆయనకు (ఉద్ధవ్ థాకరే) చూపించాను. దానికి నేను చాలా గర్వపడతాను. ఎవరైనా నన్ను మోసం చేస్తే, అందుకు నేను ప్రతీకారం తీర్చుకుంటాను’’ అని అన్నారు.

ఇక శివసేన, కాంగ్రెస్ పార్టీలతో శివసేన పొత్తు పెట్టుకోవడాన్ని ఫడ్నవీస్ తప్పు పట్టారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ‘‘రాజకీయ అవసరాల కోసం కొన్ని పొత్తులు సబబే. కానీ, పూర్తిగా భావజాల వ్యతిరేకమైన కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం తమ భావజాలాన్నే వదిలిపెట్టుకున్నారు. గొంతు నుంచి మాటలు వస్తున్నాయి కానీ, అందులో వారి భావజాలం ఎంతమాత్రం లేదు. వాస్తవానికి ఆ కూటమి కూడా శివసేన నడపడం లేదు. థాకరే ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఉన్నారు. కానీ కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి’’ అని అన్నారు.

కాగా, దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీకారం అనేది మహారాష్ట్ర రాజకీయాల్లో లేదని, కానీ ఫడ్నవీస్ అలాంటి రాజకీయాలు చేసి మహారాష్ట్ర సంప్రదాయాల్ని మంటగలుపుతున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర సంప్రదాయంలోనే ప్రతీకారం అనే పదం లేదని, దాన్ని రాజకీయాల్లోకి జొప్పించినందుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు సంజయ్ రౌత్ అన్నారు.

Rahul Gandhi: బ్రిటిషర్లకు సావర్కర్ రాసిన లేఖను బయట పెట్టిన రాహుల్ గాంధీ