ఆ పదవితో మందా జగన్నాథంలో అసంతృప్తి..

  • Published By: sreehari ,Published On : August 17, 2020 / 03:04 PM IST
ఆ పదవితో మందా జగన్నాథంలో అసంతృప్తి..

తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మందా జగన్నాథానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ చాణక్యతతో మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. అధిష్టానాల మెప్పు పొందుతూ లోక్‌సభ సభ్యుడిగా నాలుగుసార్లు దక్కించుకొని విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీలలో కీలక నేతగా ఎదిగి జిల్లా రాజకీయాలను కొంత కాలం శాసించారు.

నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ కావడంతో మూడు సార్లు టీడీపీ నుంచి, ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 1996, 1999, 2004 వరుసగా మూడు సార్లు టీడీపీ ఎంపీగా గెలుపొందారు.

తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు జగన్నాథం. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో 2013లో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ అధిష్టానానికి దగ్గరవుతూ.. సీఎం కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు. జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో మందా జగన్నాథం కూడా కీలక నేతగా ఎదిగారు. 2014లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొట్ట మొదటి ఎన్నికల్లో నాగర్ కర్నూల్
పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున మరోసారి బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి నంది ఎల్లయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మందా జగన్నాథానికి పార్టీ అధిష్టానం ఎలాంటి పదవి కట్టబెట్టలేదు.

2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తనకే ఎంపి టికెట్ వస్తుందని భావించారు జగన్నాథం. కానీ, అనూహ్యంగా టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన రాములు వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో కొంత అసహనానికి లోనైన జగన్నాథాన్ని టీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించింది. సరైన సమయంలో గౌరవప్రదమైన పదవిస్తామని, రాములు విజయానికి కృషి చేయాలని సూచించింది.

దీంతో రాములు గెలుపునకు కృషి చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమించింది. అధికార ప్రతినిధిగా నియమించినా ఆ పదవితో మంద జగన్నాథం సంతృప్తిగా లేరంటున్నారు. ఇదే విషయాన్ని పదే పదే అనుచరుల ముందు చెబుతూ ఫీలవుతున్నారట.

పార్టీలో న్యాయం జరగలేదని :
నాలుగు సార్లు ఎంపీగా గెలిచి… కాంగ్రెస్, టీడీపీల్లో చక్రం తిప్పిన తనకు పార్టీలో సరైన న్యాయం జరగలేదని జగన్నాథం తన అనుచరవర్గంతో చెప్పుకొని బాధ పడుతున్నారట. ఓవైపు తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో మరో వైపు తన కొడుకు భవిష్యత్తు కూడా ఆయనను ఆందోళన కలిగిస్తోందట. 2014 ఎన్నికల్లో మందా జగన్నాథం ఎంపీగా, తనయుడు మందా శ్రీనాథ్‌ ఎంఎల్ఎగా టీఆర్ఎస్ అధిష్టానం టికెట్లు ఇచ్చినా ఆ ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి పాలయ్యారు. అలంపూర్ అసెంబ్లీ సెగ్మెట్ నుంచి టీఆర్ఎస్ తరఫున శ్రీనాథ్‌ ఓడిపోయారు.

ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో టీడీపీ నుంచి వచ్చిన అబ్రహంకు టీఆర్ఎస్ అధిష్టానం 2018 ఎన్నికల్లో అలంపూర్‌ టికెట్ కేటాయించింది. దీంతో
తండ్రీకొడుకులిద్దరికీ టీఆర్ఎస్ టికెట్‌ లభించకపోవడంతో కొంతవరకు పార్టీ కర్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్నప్పటికీ తన కేడర్‌కు న్యాయం చేయలేకపోతున్నానని ఆందోళన చెందుతున్నారట జగన్నాథం. టీఆర్ఎస్ అధిష్టానం తనకు న్యాయం చేస్తుందని, గౌరవప్రదమైన పదవి ఇస్తుందనే ఆశతో ఉన్నారట.

ప్రస్తుతం హైదరాబాద్‌కే పరిమితమైన ఇద్దరు నేతలు నాగర్ కర్నూల్ జిల్లాలో పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదని కార్యకర్తలు అంటున్నారు. జిల్లాకు చెందిన కీలక నేతలు కూడా మందా ఫ్యామిలీని కలుపుకొనిపోవడం లేదనే చర్చ జరుగుతోంది. మరి వీరిద్దరినీ టీఆర్ఎస్‌ మళ్లీ గుర్తింపునిచ్చేలా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాల్సిందే.