బీసీలపై ప్రేమ చాటుకున్న టీడీపీ ప్రభుత్వం : అధిక నిధులు

బీసీల పార్టీగా ముద్ర పడిన టీడీపీ.. మరోసారి వారిపై తన ప్రేమను చాటుకుంది.

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 03:59 PM IST
బీసీలపై ప్రేమ చాటుకున్న టీడీపీ ప్రభుత్వం : అధిక నిధులు

బీసీల పార్టీగా ముద్ర పడిన టీడీపీ.. మరోసారి వారిపై తన ప్రేమను చాటుకుంది.

హైదరాబాద్ : బీసీల పార్టీగా ముద్ర పడిన టీడీపీ.. మరోసారి వారిపై తన ప్రేమను చాటుకుంది. ఆయా వర్గాల అభివృద్ధికి గతమెన్నడూ లేనంతగా నిధులు ఖర్చు చేసింది. ఐదేళ్లలో 20వేల కోట్లకు  పైగా ఖర్చు చేసి బీసీల అభ్యున్నతికి పట్టం కట్టింది. బీసీలంటే కేవలం ఓటు బ్యాంకు కాదని నిరూపించింది. వెనుకబడిన, బలహీన వర్గాలకు ఆర్ధికంగా, సామాజికంగా చేయూతనందించింది. ఆ బీసీలే మరోసారి తమను అధికారపీఠంపై కూర్చోబెడతారని టీడీపీ నమ్ముతోంది.

బతుకు బండి సాగకున్నా.. బలవంతంగా వారసులపై కులవృత్తులను రుద్దే రోజులు పోయాయి. అవును ఆంధ్రప్రేదశ్‌లో పరిస్థితులు మారాయి. సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు  బీసీల జీవితాల్లో కొత్త వెలుగు తీసుకొచ్చారు. వెనుకబడిన వర్గాల ఆర్ధిక, సామాజిక పరిపుష్టికి ఓ మహా యజ్ఞానికి నాంది పలికారు. ఆదరణ పథకం ద్వారా బీసీలను అభివృద్ధికి చేరువ చేస్తూ నూతన రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. బీసీలంటే కేవలం ఓటు బ్యాంకు కాదని నిరూపించారు. బీసీ సామాజిక వర్గాలకు ఎన్నడూ లేని విధంగా ఐదేళ్లలో  300శాతం అధిక నిధులను చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. 2004 నుంచి 2014 వరకు పదేళ్లలో ప్రభుత్వాలు 7వేల 815కోట్లు మాత్రమే ఖర్చు చేశాయి. టీడీపీ  ప్రభుత్వం మాత్రం ఐదేళ్లలో 22వేల 704 కోట్లు కేటాయించి బీసీ సంక్షేమ సర్కార్‌ అని నిరూపించుకుంది. 

చదువుతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని నమ్మిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల విద్యకు భారీగా నిధులు ఖర్చు చేశారు. 1253 ప్రీ మెట్రిక్ వసతి గృహాల ద్వారా లక్షా 28వేల  187మంది విద్యార్ధులను చదివిస్తున్నారు. వారికి ఆహారం కోసం 833కోట్లు, కాస్మోటిక్ చార్జీల కోసం 334కోట్లు ఖర్చు చేశారు. కాపులను బీసీల్లో చేర్చి లక్షా39వేల634 మంది విద్యార్ధులకు 35కోట్లు స్కాలర్‌షిప్‌ అందించారు. అదే విధంగా 2లక్షల 41వేల 350 మందికి 440 కోట్లు ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్ చేశారు. టీడీపీ ప్రభుత్వం  కొత్తగా 76 రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ ఉన్నత విద్యాదరణ పథకం ద్వారా 5వేల 672 మంది విద్యార్ధులకు 74కోట్లు ఖర్చు చేసి ప్రముఖ  కోచింగ్ సెంటర్లలో సివిల్స్ కోచింగ్ ఇప్పించింది. నెలకు 10వేల చొప్పున తొమ్మిది నెలలు విద్యార్ధులకు స్టైఫండ్ చెల్లించింది. ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ ఫథకం కింద 1505 మంది  విద్యార్ధులకు 150 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఒక్కో విద్యార్ధికి గరిష్టంగా 10లక్షల ఫీజును ప్రభుత్వం భరిస్తోంది. 

బీసీలకు సంస్కృతి, సామాజిక మేళవింపు ఉండాలన్న సదుద్దేశంతో ప్రతి జిల్లాలో బీసీ భవనాల నిర్మాణం చేపట్టింది. ఒక్కో భవన నిర్మాణానికి 5కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటి వరకు 117కోట్లు బీసీ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలకు కేటాయించింది. చంద్రన్న పెళ్లి కానుక కింద నూతన వధువుకు 35వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. గత ఆర్ధిక సంవత్సరంలో చంద్రన్న పెళ్లికానుక కింద 100కోట్లు కేటాయించి అందులో 73కోట్లు లబ్ధిదారులకు అందజేసింది. బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు 1967కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో వివిధ పథకాల కోసం 1735కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీని వల్ల మొత్తం  2లక్షల 91వేల 324 మంది లబ్ధి పొందారు. 

90శాతం సబ్సిడీతో కులవృత్తుల వారికి పనిముట్లను అందజేసిన ప్రభుత్వం… ఇందుకోసం 964కోట్లను ఖర్చు చేసింది. ఇప్పటి వరకు 2లక్షల 05వేల మందికి పైగా ఈ పథకం ద్వారా  లబ్దిపొందారు. మేదర, గీత, నిర్మాణరంగ కార్మికులు, శిల్పులకు నేరుగా 10వేల నగదు కూడా ప్రభుత్వం ఇస్తోంది. రజకులకు ఇస్త్రీ పెట్టెతో పాటు 10వేల రూపాయల నగదు అందించింది.  వెనుకబడిన తరగతుల్లోని అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయడానికి 11ఫెడరేషన్లను చంద్రబాబు ఏర్పాటు చేశారు. వీటి  ద్వారా రూ.433కోట్లను 96వేల 333మంది లబ్ధిదారులకు అందజేసింది.