ఆదాయాన్ని వారసులకు ఇవ్వను – వెంకయ్య నాయుడు

  • Published By: madhu ,Published On : January 9, 2020 / 02:43 PM IST
ఆదాయాన్ని వారసులకు ఇవ్వను – వెంకయ్య నాయుడు

‘తన కోరిక ప్రజా సేవలో నిమగ్నమై ఉండాలి..అది పదవితో రాకూడదు…స్వచ్చంద సేవయై ఉండాలి.. మిగిలిన శక్తిని, కొద్దిపాటి ఆదాయాన్ని వ్యక్తిగత బాధ్యతలకు ఖర్చులు తప్పితే..మిగతాది తన వారసులకు ఇవ్వను..స్వర్ణభారతి ఫౌండేషన్‌కు, ముప్పవరపు ఫౌండేషన్‌కు ఇస్తా’ అని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడించారు. 2020, జనవరి 09వ తేదీ శిల్పకళా వేదికలో సంక్రాంతి సంబరాలు జరిగాయి.

 

ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడుతో పాటు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ సుజనా చౌదరి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, నటులు వెంకటేశ్, మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..

 

తనకు ఏమీ కోరికలు లేవని, సామాన్య స్థాయి నుంచి ఉప రాష్ట్రపతి వరకు చేరుకోవడం జరిగిందన్నారు. ప్రజా సేవలో నిమగ్నమై ఉండాలని తాను కోరుకోవడం జరుగుతోందన్నారు. సమాజానికి కొంత ఆదాయం ఇవ్వడం కర్తవ్యమన్నారు. సంక్రాంతిని గుర్తు పెట్టుకోవడం, సంస్కృతిని కాపాడుకోవడం కోసం..స్వర్ణభారతి ఒక వేదిక ఏర్పాటు చేసిందని, అందులో భాగంగా శిల్పకళా వేదికలో కళాకారులను ప్రదర్శన ఎంతో ఆకట్టుకుందన్నారు. 

ముప్పవరపు ఫౌండేషన్ ఏర్పాటై 9 సంవత్సరాలు పూర్తయి..10 ఏళ్లు అవుతుందని ఈ సందర్భంగా దశమ వార్షికోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు, ఒక స్పూర్తి రావాలనే ఇలా చేయడం జరిగిందన్నారు. రాజకీయాల్లో వారసత్వాల పట్ల విశ్వాసం తనకు లేదని..ఇది తన వ్యక్తిగతమన్నారు. తన పిల్లలను ప్రోత్సాహించలేదని చెప్పారు. కానీ సేవా కార్యక్రమంలో వారసత్వం ఉండాలని కోరుకుంటానన్నారు.

 

తన కుటుంబ వ్యక్తులు సేవా కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకోవడం గొప్ప ఆనందాన్ని ఇస్తుందన్నారు. తన కుటుంబసభ్యులు ముప్పవరపు ఫౌండేషన్ పెట్టి విజయవంతంగా పూర్తి చేసినందుకు తన వారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. సేవా భావాన్ని పెంపొందించుకోవడానికి..రెండు అవార్డుల్లో తన పేరు పెట్టుకోవడానికి ఒప్పుకున్నట్లు వివరించారు.

వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ ఎం.ఎస్.స్వామినాథన్, సేవా కార్యక్రమంలో గుత్తా ముణిరత్నంకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప పరిణామమన్నారు. 

అవార్డుకు న్యాయనిర్ణేతలుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి  జస్టిస్ నాగేశ్వరరావు, మిత్రుడు, వ్యాపార వేత్త గ్రంథి మల్లిఖార్జున్, డీఆర్డీవో శాస్త్రవేత్త డా.సతీష్ రెడ్డి, ప్రముఖ వ్యాఖ్యాత జర్నలిస్టు, గురుమూర్తి, సహచరుడు ఆచార్య అశోక్, కేవీ చౌదరిలు ఉంటారన్నారు. 

Read More : JNU వైస్ ఛాన్స్‌లర్‌ను తొలగించాల్సిందే – మురళీ మనోహర్ జోషి