YS Sharmila : అసలు సోనియా గాంధీ ప్లాన్ ఏంటి? షర్మిలతో జగన్‌ను దెబ్బకొట్టనుందా?

షర్మిల ద్వారా సీఎం జగన్ ను దెబ్బతీసి ఏపీలో ఎదగాలని కోరుకుంటోంది కాంగ్రెస్. పూర్వ వైభవం సంపాదించాలని.. YS Sharmila - CM Jagan

YS Sharmila : అసలు సోనియా గాంధీ ప్లాన్ ఏంటి? షర్మిలతో జగన్‌ను దెబ్బకొట్టనుందా?

YS Sharmila - CM Jagan

YS Sharmila – CM Jagan : రాజన్న బాణం రూటు మారింది. కాంగ్రెస్ లో విలీనం దిశగా ప్రయాణిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మార్పు తెస్తానని సొంత పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల పార్టీ నడపలేని స్థితికి చేరుకున్నారు. కాంగ్రెస్ లో విలీనానికి సిద్ధమయ్యారు. కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయని చెప్పిన షర్మిల ఢిల్లీలో సోనియా గాంధీతో ప్రత్యేకంగా భేటీ కావడం ద్వారా తన పొలిటికల్ జర్నీపై క్లారిటీ ఇచ్చేశారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా రాజకీయాల్లో షర్మిల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్.. షర్మిలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వబోతోంది? షర్మిల రాకను తెలంగాణ పీసీసీ స్వాగతిస్తోందా? ఏపీలో కాంగ్రెస్ కు మళ్లీ జీవం వస్తుందా?

వైఎస్ షర్మిల పార్టీ వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ లో విలీనం దిశగా పయనిస్తోంది. కర్నాటక ఎన్నికల తర్వాత రెండు పార్టీల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో షర్మిల భేటీ తర్వాత వైఎస్ఆర్ టీపీ విలీనంపై క్లారిటీ వచ్చేసింది. అయితే, సోనియా, షర్మిల భేటీలో ఇరు పార్టీల నుంచి కీలక నేతలు ఎవరూ లేకపోవడం, విలీనంపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో కొంత గందరగోళం కనిపిస్తున్నా ఒకటి రెండు రోజుల్లో తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది.(YS Sharmila)

కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తో పొత్తుకు ప్రయత్నించారు షర్మిల. తన కుటుంబ సన్నిహితుడు, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ తో చర్చించారు. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ అయిన డీకే.. షర్మిల ఆసక్తిని పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, పొత్తు కన్నా విలీనం చేసుకోవడానికి రెడీ కావడంతో కొన్నాళ్లు ప్రతిష్టంభన ఏర్పడింది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లోకి షర్మిల రాకను ఆ పార్టీ సీనియర్లు వ్యతిరేకించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓపెన్ గానే షర్మిలతో తమ పార్టీకి ఏం పని? అంటూ ప్రకటనలు కూడా చేశారు. అంతేకాదు షర్మిల ఏపీ రాజకీయాలను చూసుకోవాలని సలహా కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి.

Also Read.. Karimnagar: కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సింహం సింబల్ హవా.. ఎందుకో తెలుసా?

కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకించినా షర్మిల పార్టీని విలీనం చేసుకోవడానికే మొగ్గు చూపుతోంది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. షర్మిలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా రెండు రకాల ప్రయోజనాలను ఆశిస్తోంది కాంగ్రెస్. తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఆసక్తిని గమనించి ముందుగా తెలంగాణలో ప్రోత్సహించాలని చూస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. 2014 ఎన్నికల్లో తన అన్న, ఏపీ సీఎం జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు షర్మిల. ఏపీలో పాదయాత్ర చేసి జగనన్న బాణంగా చెప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత షర్మిల సైలెంట్ అయిపోయారు.(YS Sharmila)

2019 ఎన్నికల్లో జగన్ పాదయాత్రతో ఏపీలో ఘన విజయం సాధించింది వైసీపీ. కానీ, షర్మిలకు వైసీపీలో కానీ ఏపీ రాజకీయాల్లో కానీ ఎలాంటి ప్రాధాన్యం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ కోడలిగా ఇటువైపు రాజకీయం చేద్దామని నిర్ణయించుకున్నారు షర్మిల. 2021 జూలైలో తన తండ్రి పేరు గుర్తుకు వచ్చేలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. తెలంగాణలో పోటీ చేయాలని, అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావించారు. అంతేకాదు కేసీఆర్ తర్వాత తానే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకొచ్చారు. 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. ఊరూరా తిరిగినా జనం నుంచి పెద్దగా స్పందన కనిపించకపోవడంతో చివరికి కాంగ్రెస్ పంచన చేరడానికి రెడీ అవుతున్నారు షర్మిల.

తెలంగాణ రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకోవడానికి ప్రయత్నించిన షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అక్కడ పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించారు. తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి పాలేరు భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. అయితే, ఇప్పుడు షర్మిల పార్టీ కాంగ్రెస్ గూటికి చేరితే ఆమె అసెంబ్లీ కల నెరవేరుతుందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఆమె పోటీ చేద్దామనుకున్న పాలేరులో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుని బరిలోకి దించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.

Also Read..Telangana Congress: కాంగ్రెస్‌ పార్టీలో హాట్‌హాట్‌గా మారిన ఫ్యామిలీ పాలిటిక్స్‌!

తుమ్మల కాంగ్రెస్ లో చేరితే కచ్చితంగా పాలేరు సీటు ఆయనకు ఇవ్వాల్సిందే. ఉమ్మడి ఖమ్మంలో మూడు జనరల్ సీట్లు మాత్రమే ఉన్నాయి. పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం..ఈ మూడింటిలో ఒక చోట తుమ్మల, మరో చోట మాజీ ఎంపీ పొంగులేటి పోటీ చేయనున్నారు. ఇక మిగిలిన సీటు కూడా ఓ సీనియర్ నేత కోసం రిజర్వ్ చేసినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో షర్మిల పోటీపై ఆసక్తి రేకెత్తుతోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరితే తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతారా? లేక ఏపీపైనే ఫోకస్ పెడతారా? అనే చర్చ జరుగుతోంది.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. ముఖ్యంగా సీఎం జగన్ పార్టీ పెట్టి కాంగ్రెస్ స్థానాన్ని గల్లంతు చేశారు. ఏపీలో ఎదిగేందుకు బీజేపీ ఎంతగా ప్రయత్నం చేస్తున్నా ఫలించడం లేదు. దీంతో షర్మిల ద్వారా సీఎం జగన్ ను దెబ్బతీసి ఏపీలో ఎదగాలని కోరుకుంటోంది కాంగ్రెస్. షర్మిలను తెలంగాణలో వినియోగిస్తే ఏపీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రెడిట్ ను పూర్తిగా సొంతం చేసుకోలేము అని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వేచ్ఛతోనే వైఎస్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని షర్మిల ద్వారా ప్రచారం చేసుకుని పూర్వ వైభవం సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు.(YS Sharmila)

అందుకోసం షర్మిలను తెలంగాణ నుంచి తప్పించి పూర్తిగా ఏపీ రాజకీయాలకే పరిమితం చేయాలని చూస్తున్నారు. అవసరమైతే కర్నాటక నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని చెబుతున్నారు. అయితే, షర్మిల మాత్రం తెలంగాణ రాజకీయాలపైనే ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు బంతి కాంగ్రెస్ కోర్టుకు చేరింది. జగనన్న బాణం తెలంగాణ రాజకీయాల్లో రాజన్న బాణంగా మారితే, ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి రూటు మార్చుకుని జగన్ పై గురి పెడుతూ ఉండటమే హాట్ టాపిక్.