TTD Nitya Annadanam Trust : కోట్లకు కోట్లు.. శ్రీవారి అన్నదానం ట్రస్ట్‎కు కోట్లల్లో విరాళాలు.. రూ.1,502 కోట్లకు చేరిన నిధులు

అన్నదాన ట్రస్ట్ కు విరాళాలు ఇచ్చేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. 2017 తర్వాత విరాళాలు వెల్లువెత్తాయి.ఇప్పుడు టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్ట్ పాయింట్స్ రూ.1,502 కోట్లు దాటాయి.

TTD Nitya Annadanam Trust : కోట్లకు కోట్లు.. శ్రీవారి అన్నదానం ట్రస్ట్‎కు కోట్లల్లో విరాళాలు.. రూ.1,502 కోట్లకు చేరిన నిధులు

TTD Nitya Annadanam Trust : తిరుమల శ్రీవారు నిత్యకల్యాణం పచ్చతోరణంగా వర్దిల్లుతున్నారు. తన దర్శనానికి వచ్చే భక్తులకు ఆకలి దప్పికలు లేకుండా చూస్తున్నాడు ఆ దేవదేవుడు. ఎంతమంది భక్తులు తరలివచ్చినా తన చెంతన ఎవరూ ఆకలి లేకుండా అన్నదానం అప్రతిహతంగా సాగుతోంది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తిరుమల శ్రీవారి నిత్య అన్నదాన ట్రస్ట్ కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రూ.1,502 కోట్ల నిధులతో అన్నదాన ట్రస్ట్ స్వయం సమృద్ధి సాధించింది. 2018 నుంచి టెంపుల్ ట్రస్ట్ గ్రాంట్ లేకుండా నిరాటంకంగా నిత్య అన్నదానం కొనసాగుతోంది.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు కొండకు తరలి వస్తుంటారు. దేశంలో ఎన్నో ప్రముఖ దేవాలయాలున్నా తిరుమల క్షేత్రానికి ప్రత్యేక స్థానం. అధిక సంఖ్యలో హిందువులు ఆరాధించే దైవం. ఇంత విశిష్టత, ప్రాముఖ్యత కలిగిన క్షేత్రానికి వచ్చే అనంత భక్త కోటి ఆకలి బాధలు తీరుస్తున్నది స్వామి వారి నిత్య అన్నప్రసాద వితరణ కేంద్రం. ఒకేసారి 4వేల మందికి భోజనం అందిస్తున్నారు. రోజుకు 55 మంది నుంచి 60వేల మంది వరకు భక్తులు అన్నదాన ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవాల వంటి రద్దీ రోజుల్లో అయితే రోజుకు లక్షమందికి అన్నప్రసాద వితరణ జరుగుతోంది.

తిరుమలలో తరతరాలుగా నిత్య అన్నదానం జరుగుతోంది. వందేళ్ల క్రితం తిరుమలలో రోడ్లపైనే అన్నదానం జరిగేది. అప్పట్లో రోజుకు వందల సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చేవారు. ఎందరో రాజులు, చక్రవర్తులు శ్రీవారి నైవేద్యానికి భూరి విరాళాలు ఇచ్చినా భక్తుల ఆకలి తీర్చేందుకు అన్నదానాన్ని ప్రారంభించిన ఘనత తరిగొండ వెంగమాంబకే దక్కుతుంది. 17వ శతాబ్దంలోనే తిరుమల భక్తులకు ఆమె అన్నప్రసాద వితరణ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఏటా వైశాఖ మాసంలో తిరుమలలో నృసింహ జయంతి జరిపే వెంగమాంబ 10 రోజుల పాటు అన్నదానం చేసేవారు.

శ్రీవారి ఆలయం తర్వాత అంత పవిత్రంగా భావించే అన్నదానం సత్రంలో టీటీడీ పంపిణీ చేసే అన్నప్రసాదాన్ని భక్తులు వేంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదంగా భావిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద ఉచిత అన్నదాన సత్రం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన భవనమే. అందుకేనేమో సామాన్య భక్తులే కాదు వీఐపీలు సైతం అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు వడ్డించడానికి క్యూ కడుతుంటారు. వడ్డించడమే కాదు సామాన్య భక్తులతో కలిసి భోజనం చేస్తుంటారు. ఈ మహత్ కార్యక్రమాన్ని శ్రీవారి అన్నదానం ట్రస్ట్ నిర్వహిస్తోంది. కేవలం భక్తులు ఇచ్చే విరాళాల ఆధారంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది.

అన్నదాన ట్రస్ట్ కు విరాళాలు ఇచ్చేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. అంత ఇంత అని కాదు.. ఎంతైనా విరాళంగా ఇవ్వొచ్చు. 2017 వరకు టీటీడీ ఎస్వీ అన్నదాన ట్రస్ట్, టెంపుల్ గ్రాంట్స్ తో నడిచింది. టీటీడీ నిధులపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ, 2017 తర్వాత విరాళాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ఏనాడూ ఆలయ నిధులపై ఆధారపడాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్ట్ పాయింట్స్ రూ.1,502 కోట్లు దాటాయి. ఎక్కువమంది భక్తులు విరాళాలు ఇస్తుండటంతో నిత్యం లక్షమంది భక్తులు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగిపోతోంది.

శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులకు ఆకలి తెలియకుండా టీటీడీ అన్న ప్రసాదాలను అందిస్తోంది. ఎప్పటికప్పుడు అల్పాహారం, అన్నప్రసాదం వితరణ చేస్తోంది. ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా కాదు లేదు అనకుండా ఈ మహాయజ్ఞాన్ని నిరాటంకంగా కొనసాగిస్తోంది టీటీడీ.