తండ్రైన విరాట్ కోహ్లీ, బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క

తండ్రైన విరాట్ కోహ్లీ, బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క

Virat Kohli and Anushka Sharma : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కుటుంబంలో కొత్త వ్యక్తి వచ్చారు. కోహ్లీ సతీమణి అనుష్క..ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో ప్రసవం జరిగింది. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. తొలి బిడ్డ డెలివరీ కావడంతో కోహ్లీ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. తమకు బిడ్డ పుట్టిందనే విషయాన్ని స్వయంగా కోహ్లీ ట్విట్టర్ వేదికగా తెలియచేశారు. తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని, మధ్యాహ్నం తమకు ఆడబిడ్డ జన్మనిచ్చిందని, ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనుష్క, పాప ఆరోగ్యంగా ఉన్నారని, ఈ సమయంలో తమకు కాస్త ప్రైవసీ ఇస్తారని ఆశిస్తున్నట్లు కోహ్లీ ట్వీట్ చేశారు.

Virat Kohli

ఓ యాడ్ లో అనుష్క, కోహ్లీల మధ్య పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా..ప్రేమగా మారింది. 2017 డిసెంబర్ 11వ తేదీన ఇటలీలో అతి కొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. గత సంవత్సరం అనుష్క డెలివరీ విషయాన్ని కోహ్లీ దంపతులు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. జనవరిలో ముగ్గురం కాబోతున్నట్లు వెల్లడించడంతో అనుష్క గర్భవతి అని తేలింది. అనుష్క గర్భవతి అయిన దగ్గరి నుంచి వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఐపీఎల్ సమయంలో కోహ్లీతో కలిసి అనుష్క దుబాయ్ కు వెళ్లారు. ఆ తర్వాత..ఆస్ట్రేలియా పర్యటనకు కోహ్లీ బయలుదేరగా..అనుష్క మాత్రం స్వదేశానికి వచ్చేశారు. తన భార్య డెలివరీ సమయంలో తోడుగా ఉండాలని భావిస్తున్నట్లు సెలవు దరఖాస్తు చేసుకున్నారు కోహ్లీ. తొలి టెస్టు అనంతరం భారత్ కు తిరిగి వచ్చారు. కోహ్లీ తండ్రి కావడంతో..పలువురు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.