అమ్మవారి దర్శనానికి భక్తులు రావద్దు.. ఇంట్లోనే బోనాలు సమర్పించుకోవాలి : మంత్రి తలసాని

  • Published By: bheemraj ,Published On : July 4, 2020 / 02:04 AM IST
అమ్మవారి దర్శనానికి భక్తులు రావద్దు.. ఇంట్లోనే బోనాలు సమర్పించుకోవాలి : మంత్రి తలసాని

కరోనా నిబంధనలకనుగుణంగా (జులై 12, 2020) జరిగే సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. జాతర సందర్భంగా ఆలయంలోకి భక్తులకు అనుమతి లేదని తెలిపారు. ఎవరి ఇళ్లల్లో వారే పండుగ చేసుకోవాలని సూచించారు. వీఐపీ, వీవీఐపీలకు అనుమతి లేదన్నారు. ప్రభుత్వం తరుపున అందించే పట్టు వస్ర్తాలను దేవాలయ సిబ్బందే అమ్మవారికి సమర్పిస్తారని తెలిపారు.

శుక్రవారం (జూలై 3, 2020) సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, ఉత్తర మండల పోలీస్‌ అధికారులు, ఆలయ ట్రస్టీ, మైత్రీ కమిటీ సభ్యులతో కలిసి జాతరపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించే జాతరను కరోనా కారణంగా ఈ సంవత్సరం ఆలయం లోపలే జరుపుతామన్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు, ట్రస్టీ సభ్యులు మాత్రమే పూజల్లో పాల్గొంటారని తెలిపారు. పరిస్థితిని అర్థం చేసుకొని భక్తులు సహకరించాలని కోరారు.

(జులై 13, 2020) నిర్వహించే రంగం కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ చేసేలా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. జాతరను పురస్కరించుకొని పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేయాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌జేసీ రామకృష్ణ, ఏసీ బాలాజీ, ఈవోలు అన్నపూర్ణ, మనోహర్‌రెడ్డి, ఆలయ ట్రస్టీ సురిటి కామేశ్‌, మహంకాళి ఏసీపీ వినోద్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

కాగా, ఉజ్జయినీ అమ్మవారికి జాతరకు ముందే భక్తులు బోనాలు సమర్పించారు. తలపై బోనంతో శుక్రవారం దేవాలయానికి భక్తులు రాగా.. ఆలయ సిబ్బంది శానిటైజ్‌ చేసి టెంపరేచర్‌ చూసిన తర్వాత లోనికి అనుమతించారు. మహిళలు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.