సమీక్షలతో కేసీఆర్ బిజీ బిజీ : ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు, గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు, వరద సహాయ చర్యలు వేగవంతం

  • Edited By: madhu , October 24, 2020 / 10:27 AM IST
సమీక్షలతో కేసీఆర్ బిజీ బిజీ : ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు, గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు, వరద సహాయ చర్యలు వేగవంతం

CM KCR Directs Officials To Go For Interim Budget Review : హైదరాబాద్‌లో వరద సహాయ చర్యలను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రోజుకు లక్ష మందికి ఆర్థికసాయం చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు ప్రభుత్వ ఉద్యోగుల డీఏను పెంచుతూ వారికి దసరాకు తీపికబురు తీసుకొచ్చారు. అంతేకాదు… వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేస్తామంటూ రైతులకూ కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు.

వరుస సమీక్షలు :-
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం బిజీబిజీగా గడిపారు. వరుస సమీక్షలతో క్షణం తీరిక లేకుండా గడిపారు. వరద సహాయ చర్యలు, వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటలసాగు విధానం, బడ్జెట్‌ మధ్యంతర సమీక్షతోపాటు.. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపైనా ఆయన సమీక్షించారు.

మధ్యంతర బడ్జెట్ పై సమీక్ష :-
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కరోనా కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున మధ్యంతర సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గిందని.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కూడా కోత పడిందని చెప్పారు.
https://10tv.in/adani-group-to-officially-take-over-mangaluru-lucknow-and-ahmedabad-airport-operations-by-nov-11/
మొత్తం బడ్జెట్‌పై సమీక్ష :-
కేంద్ర జీడీపీ భారీగా పడిపోయిందని.. ఆ ప్రభావం రాష్ట్రాలపై పడుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో వాస్తవంగా ఏ మేరకు నిధులు అందుబాటులో ఉంటాయో.. ఏయే శాఖలకు ఎన్ని నిధులు విడుదల చేసే వెసులుబాటు ఉంటుందో అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం బడ్జెట్‌పై సమీక్ష నిర్వహించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ :-
ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్‌ తీపికబురు అందించారు. సర్కార్‌ ఉద్యోగుల డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2019 జులై నుంచి రావాల్సిన ఒక డీఏను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఉద్యోగులకు 5.25 శాతం మేర డీఏని పెంచినట్లు కేసీఆర్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 33.53 శాతం నుంచి 38.77 శాతానికి పెంచింది.

ఆరు నెలలకు ఒకసారి :-
మూల వేతనంపై పెరిగిన డీఏ 2019 జులై 1 నుంచి అమల్లోకి రానుంది. ప్ర భుత్వ ఉద్యోగులకు ఇస్తున్న డీఏ విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కేంద్రం అంచనాలు తయారు చేసి డీఏ నిర్ణయించే విషయంలో జాప్యం జరుగుతోందని.. ఫలితంగా బకాయిలు పేరుకుపోతున్నాయని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెల్లించాల్సిన డీఏను రాష్ట్రంలోనే నిర్ణయించాలని.. ఈ విషయమై వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.
వరద సహాయ చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష :-
ఇక హైదరాబాద్‌లో వరద సహాయ చర్యలపై సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. పునరావాస కార్యక్రమాల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల వల్ల ఇండ్లలోకి నీరొచ్చి ఆహార పదార్ధాలు, దుస్తులు, చెద్దర్లు అన్నీ తడిసిపోయాయని… కనీసం వండుకుని తినే పరిస్థితుల్లో కూడా చాలా కుటుంబాలు లేవని గుర్తు చేశారు. అందుకే వారికి తక్షణ సాయంగా ప్రతీ బాధిత కుటుంబానికి 10వేల చొప్పున సాయం అందించాలని నిర్ణయించామన్నారు.

ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మత్తు :-
ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగాలని… పండుగకు ముందే డబ్బులు అందింతే పేదలకు ఉపయోగంగా ఉంటుందన్నారు కేసీఆర్‌. రోజుకు కనీసం లక్ష మందికి ఆర్థిక సాయం అందించేలా పనిచేయాలని అధికారులకు సూచించారు.
భారీ వర్షాలు, వరదలతో 15 చోట్ల 33/11 కెవి సబ్ స్టేషన్లు దెబ్బతినగా… అన్నింటినీ మరమ్మతు చేసి పునరుద్ధరించామని ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి… సీఎం కేసీఆర్‌కు వివరించారు. 1,080 చోట్ల 11 కేవీ ఫీడర్లలో దెబ్బతినగా అన్నింటినీ మరమ్మతు చేశామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1215 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతినగా… 1,207 ట్రాన్స్ ఫార్మర్లు మరమ్మతు చేసి పునరుద్ధరించారని తెలిపారు. మిగతా 8 ట్రాన్స్ ఫార్మర్లు నీటిలో మునగడంతో మరమ్మతు చేయలేకపోయామన్నారు.
వ్యవసాయ రంగ ట్రాన్స్ ఫార్మర్లు :-
మూసీ వరదలతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి చెందిన 1145 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతినగా… 386 మరమ్మతు చేశామని… మరో 759 మిగిలి ఉన్నాయని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,299 స్థంభాలు దెబ్బతినగా… అన్నింటినీ మరమ్మతు చేశామన్నారు. మూసీ వరదలతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి చెందిన 5 వేల 335 స్థంభాలు దెబ్బతినగా… 3,249 మరమ్మతు చేశామన్నారు. మిగతా 2,086 స్థంభాల మరమ్మతు పనులు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు రఘుమారెడ్డి.

గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు :-
రైతులకు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. గ్రామాల్లోనే
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి… వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. పూర్తిగా మద్ధతు ధర ఇస్తామని హామీ ఇచ్చారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే ధాన్యానికి 1850 రూపాయలు చెల్లిస్తున్నందున.. రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

మొక్కజొన్న సాగుపై సమీక్ష :-
మొక్కజొన్న సాగుపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించారు. గతేడాది ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న వేశారు… ఎంత ధర వచ్చిందనే విషయంపై ఆరా తీశారు. మొక్కజొన్న సాగు లాభమా.. నష్టమా.. దేశంలో మొక్కజొన్న మార్కెట్ పరిస్థితి ఎలా ఉందనే విషయంపైనా చర్చించారు. అయితే… మక్కలకు మద్దతు ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి, వర్షాకాలంలో రైతులు మక్కలు సాగు చేయవద్దని గతంలో ప్రభుత్వం సూచించింది. అయినా.. రైతులు మొక్కజొన్న సాగుచేయడంపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.