ఇక పోరాటమే.. ప్రశాంతత కావాలా? అల్లర్ల హైదరాబాద్‌ కావాలా?

  • Published By: vamsi ,Published On : November 18, 2020 / 08:54 PM IST
ఇక పోరాటమే.. ప్రశాంతత కావాలా? అల్లర్ల హైదరాబాద్‌ కావాలా?

GHMC ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయం TRS పార్టీదే అని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు, కరోనా వచ్చి, డబ్బులు లేక, ఇబ్బందులు పడుతుంటే.. మన జీఎస్టీ ఇవ్వకపోయినా ఉన్నంతలో పేదలను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ అడ్డుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సంధర్భంగా.. ప్రశాంతమైన హైదరాబాద్‌ కావాలా? అల్లర్ల హైదరాబాద్‌ కావాలా? హైదరాబాద్‌లో అభివృద్ధి కావాలా? అశాంతి రాజ్యమేలాలా? హైదరాబాద్‌ ప్రజలు ఆలోచించాలని సీఎం కేసీఆర్‌ నగరవాసులను విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ నగరంలో రూ. 67 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు కేసిఆర్ వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లు గెలిచితీరుతామని, ప్రజలను కాపాడే బాధ్యత టీఆర్ఎస్‌పై ఉందని కేసిఆర్ అన్నారు. భాజపా అబద్ధపు ప్రచారాలను TRS శ్రేణులు తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేసిఆర్. ఇదే సమయంలో డిసెంబర్‌ రెండోవారంలో జాతీయస్థాయి నేతలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు కేసీఆర్‌ స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా జరిగే ఈ సదస్సుకు, ప్రధాన ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే ఇదే విషయమై పశ్చిమ్‌బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, జేడీఎస్ నేత కుమారస్వామి, NCP అధ్యక్షుడు శరద్‌పవార్‌ తదితరులతో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తామని అన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవల మృతిచెందిన తెరాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం కేసీఆర్‌ సహా నేతలు నివాళులర్పించారు.