Dalitha Bandhu KCR : వారికిచ్చే రూ.10 లక్షలు పూర్తిగా ఉచితం, తిరిగివ్వాల్సిన అవసరం లేదు.. సీఎం కేసీఆర్

దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే రూ.10లక్షల సాయం పూర్తిగా ఉచితమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇది అప్పు కాదని, తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Dalitha Bandhu KCR : వారికిచ్చే రూ.10 లక్షలు పూర్తిగా ఉచితం, తిరిగివ్వాల్సిన అవసరం లేదు.. సీఎం కేసీఆర్

Dalitha Bandhu Kcr

Dalitha Bandhu KCR : దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే రూ.10లక్షల సాయం పూర్తిగా ఉచితమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇది అప్పు కాదని, తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దళారుల మాటే ఉండదని, రైతుబంధు తరహాలో నేరుగా ఎస్సీల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని వెల్లడించారు. ఈ రూ.10లక్షలను పప్పులు, పుట్నాలకు ఖర్చు చేయకుండా ఉపాధి, వ్యాపార మార్గాలను అన్వేషించుకోవాలని సూచించారు. దళితబంధు పథకం దేశానికి ఆదర్శంగా మారుతుందని కేసీఆర్ అన్నారు.

దళితబంధు పథకంపై ఈ నెల 26న తొలి అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి దళితబంధు అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. సదస్సుకు 427 మందిని సీఎం ఆహ్వానించనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి నలుగురికి ఆహ్వానం అందనుంది. ప్రతి గ్రామం నుంచి ఇద్దరు చొప్పున పురుషులు, మహిళలను ఆహ్వానించనున్నారు.

దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. పేద దళితులే మొదటి ప్రాధాన్యతగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని.. దశల వారీగా అమలయ్యే ఈ పథకం కోసం.. 80 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. దళితబంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతుందని.. అర్హులైన దళితులందరికీ దళితబంధు పథకం అమలు చేస్తామని చెప్పారు.

కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం దళితబంధు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 100 మంది దళితులను ఎంపిక చేసి వారికి స్వయం ఉపాధి కోసం రూ.10 లక్షలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దళితుల కోసం ఇంత భారీ ఎత్తున ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం చేపట్టలేదని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ పథకం పేద దళితుల జీవితాలను మారుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన దళితబంధు పథకం రాష్ట్రంలోని ఎస్సీలందరికీ ఆశాదీపమని, వారి జీవితాల్లో పెనుమార్పులు తెస్తుందని మంత్రులు అన్నారు. సీఎం కేసీఆర్‌ దళితుల ఆత్మబంధువుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు కేసీఆర్‌ గొప్ప చొరవ తీసుకున్నారని కొనియాడారు. ఈ పథకంతో దళిత యువత, మహిళలకు ఆసరా లభిస్తుందని అన్నారు.

ఈ పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది సర్కార్. అక్కడ పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. దీంతో ఆ నియోజవర్గంలో రూ.2 వేల కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26న సీఎం కేసీఆర్ సారథ్యంలో దళితబంధు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందని వారికి ఈ దళిత బంధు పథకంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతరం కేటగిరీల వారీగా అర్హులను ఎంపిక చేయాలని సర్కార్ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. హుజూరాబాద్ నియోజవర్గంలో ఈ పథాకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసిన తర్వాత దీన్ని రాష్ట్రమంతటా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.