Triple One Go : రాజకీయ నేతలకు వరంలా మారిన జీవో నంబర్ 111

త్రిఫుల్‌ వన్‌ జీవో ఎత్తివేత అంశం తెలంగాణలో పొలిటికల్‌ సెగలు రేపుతోంది. జీవో రద్దుపై కేసీఆర్‌ టార్గెట్‌గా బీజేపీ విమర్శలు సంధించడం పొలిటికల్‌ చౌరస్తాలో హాట్‌హాట్‌గా మారింది.

Triple One Go : రాజకీయ నేతలకు వరంలా మారిన జీవో నంబర్ 111

Tripple One Go

Triple One GO Controversy : త్రిఫుల్‌ వన్‌ జీవో ఎత్తివేత అంశం తెలంగాణలో పొలిటికల్‌ సెగలు రేపుతోంది. జీవో రద్దుపై కేసీఆర్‌ టార్గెట్‌గా బీజేపీ విమర్శలు సంధించడం పొలిటికల్‌ చౌరస్తాలో హాట్‌హాట్‌గా మారింది. ఏళ్ల తరబడి ఎన్నికల నినాదంగా నానుతున్న త్రిఫుల్‌ వన్‌ జీవో రద్దు అవుతుందా.. కాదా… ఇంతకు దీనిపై సర్కార్‌ వాదనేంటి? జీవో నంబర్‌ త్రిఫుల్‌ వన్‌ రెండున్నర దశాబ్దాలుగా వివాదానికి కేంద్రబిందువుగా మారింది. హైదరాబాద్‌ శివారులోని ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల పరిరక్షణ కోసం నాడు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చింది. జంట జలాశయాల పరివాహక ప్రాంతాలు.. నిర్మాణాలు చేపట్టడం ద్వారా జలాశయాలు కలుషితం కావొద్దన్నదే ఈ జీవో లక్ష్యం. అయితే ఈ జీవోపై మాత్రం నాటి నుంచి నేటి వరకు వివాదం నడుస్తూనే ఉంది.

ఓట్లు వచ్చినప్పుడల్లా రాజకీయ నేతలకు ఈ జీవో ఒక వరంలా మారింది. ఈ జీవో పేరు చెప్పుకుని ఓట్లు దండుకుంటున్నాయి. 1996లో టీడీపీ హయాంలో తీసుకొచ్చిన జీవో 111 పరిధిలో మొత్తంగా 84 గ్రామాలు ఉన్నాయి. ఎలక్షన్స్‌ సమయంలో ఈ గ్రామాల నుంచి వస్తున్న డిమాండ్‌తో రాజకీయ పార్టీలు జీవో రద్దుపై హామీలు గుప్పిస్తూ ఆ గ్రామాల ప్రజల ఓట్లను తమ ఖాతాలో వేసుకుంటున్నాయి. నాడు వైఎస్‌ నుంచి ఇప్పటి వరకు అంతా జీవో త్రిఫుల్‌ వన్‌ను రద్దు చేస్తామని హామీనిచ్చిన వారే. దీంతో రెండున్నర దశాబ్దాలుగా ఈ జీవో రద్దు అంశం ఆ గ్రామాల్లో ఎన్నికల హామీగా మారిపోయింది.

టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలోనూ జీవో నంబర్‌ త్రిఫుల్‌ వన్‌ను రద్దు చేస్తామని హామీనిచ్చారు. అసెంబ్లీలో సైతం త్రిఫుల్‌ వన్‌ రద్దును సైతం కేసీఆర్‌ ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జీవో రద్దుపై ఇబ్బందులు రాకుండా సీఎస్‌ నేతృత్వంలో హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్‌. ఈ కమిటీ ఏర్పాటై కూడా నాలుగేళ్లు గడిచిపోయింది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్ట్‌ ఇవ్వకపోవడం రాజకీయంగా మరోసారి మంటలు రాజేస్తోంది. దీన్నే ఆయుధంగా చేసుకుని సర్కార్‌పై విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి.

హైపవర్‌ కమిటీ రిపోర్ట్‌ ఇవ్వకపోవడంపై సర్కార్‌ను నిలదీసింది హైకోర్టు. దీంతో నాలుగేళ్లైనా ఎందుకు రిపోర్ట్‌ ఇవ్వలేదన్న వాదన తెరపైకి వచ్చింది. జీవో త్రిఫుల్‌పై సర్కార్‌ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. జీవో రద్దుపై కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. జీవో రద్దుకు సుప్రీంకోర్టు తీర్పులు ప్రధాన అడ్డంకిగా మారాయని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.

పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టడం వల్ల జంట జలాశయాలు కలుషితం అవుతాయన్నది సుప్రీంతీర్పు. సుప్రీంతీర్పు అనుసరిస్తూ… రాజధానికి ఈ జంట జలాశయాలు నుంచి త్రాగునీరు తీసుకోకుండా జాగ్రత్తలు మొదలుపెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే రాజధానికి కృష్ణా, గోదావరి నుంచి త్రాగునీరు తీసుకొచ్చిన సర్కార్‌.. నగరం నలుదిక్కులా నాలుగు జలాశయాలను నిర్మిస్తోంది.

దీంతో జంట జలాశయాల త్రాగునీరు కలుషితం అన్నదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టడంతో… న్యాయస్థానాల్లో కూడా ఈ జీవోకు ఉన్న అడ్డంకులను తొలగించవచ్చన్నది సీఎం కేసీఆర్‌ ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికి ఎవరెన్ని రకాలుగా టార్గెట్‌ చేసినా.. సర్కార్‌ మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. జీవో రద్దుకు పూర్తి స్థాయిలో గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసినట్టుగా తెలుస్తోంది.