Telangana Schools : తెలంగాణలో కరోనా : మళ్లీ స్కూల్స్ బంద్ ? మూడు రోజుల్లో నిర్ణయం – కేసీఆర్

తెలంగాణ స్కూల్స్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో తరగతులను కొనసాగించాలా లేదా అన్న అంశంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్.

Telangana Schools : తెలంగాణలో కరోనా : మళ్లీ స్కూల్స్ బంద్ ? మూడు రోజుల్లో నిర్ణయం – కేసీఆర్

KCR

Corona in Telangana : తెలంగాణలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో కేసులు పెరుగుతున్నాయి. వివిధ జిల్లాల్లో విద్యార్ధులు కరోనా బారిన పడుతున్నారు. మంచిర్యాల, జగిత్యాల, మేడ్చల్‌, నిర్మల్‌, కామారెడ్డి జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. స్కూల్స్‌ను మళ్లీ క్లోజ్ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది.
తెలంగాణ స్కూల్స్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో తరగతులను కొనసాగించాలా లేదా అన్న అంశంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా… పెరుగుతున్న కరోనా కేసులపై కేసీఆర్ మాట్లాడారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలల నిర్వహణపై తానే స్వయంగా రెండు మూడు రోజుల్లో సభలోనే ప్రకటన చేస్తామన్నారు కేసీఆర్….

మరోవైపు…కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభణతో అప్రమత్తమైన కేంద్రం. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశమైన ప్రధాని మోదీ.. ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ భయభ్రాంతులకు గురిచేయవద్దని, అలాంటి వాతావరణాన్ని ఎట్టి పరిస్థితిల్లోనూ సృష్టించవద్దని సీఎంలకు సూచించారు. ముంచుకొస్తున్న సెకండ్‌ వేవ్‌ను ముందుగానే అరికట్టడానికి కృషి చేయాలన్నారు.

పలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వందలాది మంది విద్యార్థులకు కరోనా సోకిందనే వార్త అటు తల్లిదండ్రులను, ఇటు ప్రభుత్వాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు ఎంతవరకు సేఫ్ అనే సందేహం వ్యక్తమవుతోంది. తల్లిదండ్రుల్లో మళ్లీ భయాందోళన మొదలైంది.

హైదరాబాద్ నాగోల్ జెడ్పీ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ రావడంతో స్కూల్ ను మూసివేశారు. తోటి ఉపాధ్యాయులకు వైద్య అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు.
తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 36 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది.
న్యూ బోయిన్‌పల్లి బాపూజీనగర్‌లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహంలో ముగ్గురు విద్యార్థులు కరోనా బారినపడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మంచిర్యాలలోని బాలికల పాఠశాలలో 2021, మార్చి 16వ తేదీ మంగళవారం 28 మందికి కరోనా సోకింది. ఆరోగ్యశాఖ ప్రత్యేక వైద్య శిబిరంలో 174 మందికి పరీక్షలు నిర్వహించగా 34 పాజిటివ్‌గా తేలాయి. ఇందులో 28 మంది విద్యార్థినులు.. ఆరుగురు తల్లిదండ్రులున్నారు.
కామారెడ్డి సమీప కస్తూర్బా విద్యాలయంలో 32 మంది విద్యార్థినులకు కరోనా సోకినట్లు నిర్ధారించారు.
కరీంనగర్‌ నగరం సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఐదుగురు విద్యార్థులు, ఒక టీచర్ కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.