తెలంగాణలో కరోనా రికవరీ రేటు 91.85 శాతం

  • Published By: bheemraj ,Published On : November 6, 2020 / 02:40 AM IST
తెలంగాణలో కరోనా రికవరీ రేటు 91.85 శాతం

Corona recovery rate : తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోనే ఉన్నప్పటికీ, కొత్త కేసుల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. బతుకమ్మ, దసరా తర్వాత పలు జిల్లాల్లో కేసులు పెరిగాయి. రికవరీ రేటు ఆశాజనకంగా ఉందని అధికారులు తెలిపారు. బుధవారం నాటికి రాష్ట్రంలో రికవరీ రేటు 91.85 శాతం నమోదైనట్టు గురువారం (నవంబర్ 5, 2020) విడుదల చేసిన బులిటెన్‌లో వైద్యారోగ్యశాఖ తెలిపింది.



ఇప్పటివరకు నిర్వహించిన టెస్టుల సంఖ్య 44 లక్షలకు చేరుకుంది. 2.45 లక్షల మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 2.25 లక్షల మంది కోలుకున్నారు. మరో 18,656 మంది చికిత్స పొందుతున్నారు. బుధవారం 44 వేల పరీక్షలు నిర్వహించగా, 1,539 మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 285, రంగారెడ్డి జిల్లాలో 123, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 102 కేసులు నమోదయ్యాయి.



ఉపాధి హామీ పనుల్లో ‘జన్‌ ఆందోళన్‌ కొవిడ్‌-19’ క్యాంపెన్‌ను పంచాయతీరాజ్‌శాఖ గురువారం ప్రారంభించింది. ఉపాధి హామీ అధికారులు, కూలీలు, గ్రామీణ ప్రజలు కొవిడ్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల డీఆర్డీవోలు, డీఆర్డీఏలకు గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు ఆదేశాలు జారీ చేశారు.



కొవిడ్‌ జాగ్రత్తలపై పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, స్వయం సహాయ గ్రూపుల భవనాలు, పాఠశాల టాయిలెట్లపై ప్రచారం చేయాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.