Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ట్విస్ట్.. ఎమ్మెల్సీ కవిత ఫొటోపై రాజకీయ దుమారం

లిక్కర్ స్కామ్ కేసు నిందితులతో ఎమ్మెల్సీ కవిత ఫొటో బయటకు రావడంపై రాజకీయ దుమారం చెలరేగింది. రామచంద్ర పిళ్లై కుటుంబంతో కవిత కుటుంబం తిరుపతి వెళ్లింది.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ట్విస్ట్.. ఎమ్మెల్సీ కవిత ఫొటోపై రాజకీయ దుమారం

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాఫ్తును ముమ్మరం చేసింది ఈడీ. సీబీఐ ఇచ్చిన సమాచారంతో ముడుపులపై కూపీ లాగుతోంది. ఢిల్లీలో మద్యం టెండర్లలో కంపెనీల సిండికేట్ కు హైదరాబాద్ లో రూపకల్పన జరిగినట్లు సీబీఐ అనుమానిస్తోంది. హైదరాబాద్ లో ఐదు చోట్ల ఢిల్లీ ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. రాబిన్ డిస్టలరీస్ కార్యాలయం, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు జరిపారు.

సికింద్రాబాద్, కోకాపేట్, నార్సింగ్ లో ఈ సోదాలు జరిగాయి. కీలక పత్రాలు, బ్యాంకు లావాదేవీలపై ఆరా తీశారు. రామచంద్రన్ పిళ్లై ఇతర వ్యాపారాలపైనా ఈడీ దృష్టి సారించింది. హైదరాబాద్ సహా కర్నాటక, చెన్నై, ఢిల్లీ వ్యాపారాలపై ఆరా తీసింది. లిక్కర్ స్కామ్ కేసు నిందితులతో ఎమ్మెల్సీ కవిత ఫొటో బయటకు రావడంపై రాజకీయ దుమారం చెలరేగింది. రామచంద్ర పిళ్లై కుటుంబంతో కవిత కుటుంబం తిరుపతి వెళ్లింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో డబ్బుని విదేశాలకు మళ్లించారని సీబీఐ చెప్పడంతో.. ఈడీ రంగంలోకి దిగింది. నిన్న ఏకకాలంలో దేశవ్యాప్తంగా 32 చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు పూర్తి ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ కేసులో ఏ14గా ఉన్న రామచంద్ర పిళ్లై నివాసంతో పాటు మరో ఐదు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు పత్రాలతో పాటు హార్డ్ డిస్క్ లు, కంపెనీకి సంబంధించిన పలు ఆధారాలను ఈడీ అధికారులు సేకరించారు.

ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కామ్.. దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. మంగళవారం దేశవ్యాప్తంగా 30 చోట్ల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, బెంగళూరు నగరాల్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ లిక్కర్ స్కామ్‌లో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పేర్లు బయటికి రావడం మరింత సంచలనం రేపింది. లిక్కర్ స్కామ్ రాజకీయ రంగు పులుముకుంది.

ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్రన్ పిళ్లై సహా అభిషేక్ రావు, సుదిని సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్‌సాగర్ నివాసాలు, కార్యాలయాలతో పాటు రాబిన్ డిస్టిలర్స్ ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు జరిగాయి.

ఢిల్లీ లిక్కర్ కేసులో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ గుర్తించింది. రాజకీయ నాయకులు, ప్రముఖులు కలిసి ఈ లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలకు సంబంధించిన లెక్కల్లో అవకతవకలకు పాల్పడి మనీ లాండరింగ్ చేశారని వార్తలొచ్చాయి. ఈ కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు చేసిన సమాచారం మేరకు ఈడీ రంగ ప్రవేశం చేసింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించిన అనంతరం నిందితులుగా ఉన్న వారందరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.